చిరు వ్యాపారులతో చెలగాటం
పలాస: కాశీబుగ్గ కేటీ రోడ్డులోని క్రిస్టియన్, ముస్లిం శ్మశానం ఎదురుగా గత కొన్నేళ్లుగా ఆశీలు కడుతూ వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారులతో టీడీపీ నాయకులు చెలగాటమాడుతున్నారు. మున్సిపాలి టీ ఏర్పాటు కాక ముందు నుంచి శ్మశానం ఎదురుగా వీరు వ్యాపారాలు చేస్తున్నారు. గతంలో కేటీ రోడ్డు వెడల్పు చేసే సమయంలో వీరిని శ్మశానం ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పైకి పంపించారు. రోడ్డు వెడల్పైన తర్వాత వీరు మళ్లీ యథా స్థానాలకు వచ్చారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్‌గా వచ్చిన ఇ.శ్రీనివాసరావు వారిని ఫుట్‌పాత్‌పైకి పంపడంతో అంతా వెళ్లిపోయారు. ఇటీవల ఓ టీడీపీ నేత వారి వద్దకు వెళ్లి అద్దె వసూలు చేయడానికి రాయబేరా లు నడిపాడు. మున్సిపాలిటీకి తాము ఆశీళ్లు కడుతున్నామని వ్యాపారులు చెప్పినా ఆ నాయకుడు ఒప్పుకోలేదు. తమకు డబ్బులు చెల్లిస్తేనే షాపులు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో వారంతా ఆందోళన చేసి రోడ్డు మీద దుకాణాలు పెట్టుకున్నారు. గురువారం పోలీసులు వచ్చి మళ్లీ ఫుట్‌పాత్ ము న్సిపాలిటీదని, అక్కడే పెట్టుకోండని వారే దగ్గరుండి మళ్లీ పెట్టించారు. బాధిత వ్యాపారులు రోహిణీ బెహరా, మీనకేశ్వరరావు, బరాట వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ తమ పొట్టకొట్టవద్దని, చాలా కాలంగా దీన్ని నమ్ముకొని బతుకుతున్నామని, మున్సిపాలిటీకి కూడా ఆశీలు కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో తీరుగా వ్యవహరిస్తూ నరకం చూపిస్తున్నారని అంటున్నారు.


