అల్లం సాగుపై ఆసక్తి..!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం
రాయితీపై విత్తనాలు పంపిణీ
సహకారం అందిస్తున్న కొత్తూరు వెలుగు అసోసియేషన్
మెళియాపుట్టి: వ్యవసాయంలో నూతన పంటల సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయ పంటల సాగు వలన వస్తున్న నష్టాల నుంచి గట్టెక్కేందుకు వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగానే అల్లం సాగుపై అధికంగా మక్కువ చూపిస్తున్నారు. ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గం వ్యాప్తంగా 1,328 ఎకరాల్లో గిరిజనులు అల్లం సాగు చేస్తున్నారు. కొత్తూరు వెలుగు అసోసియేషన్ (స్వచ్ఛంద సంస్థ) సభ్యులు స్వచ్ఛందంగా అల్లం విత్తనాలను రాయితీపై ఇస్తూ సహకారం అందిస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గవ్యాప్తంగా అల్లం సాగు చేస్తున్నారు. మార్కెట్‌లో దొరికే హైబ్రీడ్ అల్లం వలన పలువురు చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అందువలన మైదాన ప్రాంత ప్రజలు గిరిజన రైతులు పండిస్తున్న దేశీ అల్లం, అదేవిధంగా చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. కరోనా తర్వాత అత్యధిక శాతం మంది ఆహారపు అలవాట్లను మార్చుకున్నారని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఎటువంటి ఎరువులు ఉపయోగించకుండా అల్లం పండిస్తున్నట్లు పలువురు గిరిజనులు తెలుపుతున్నారు. వారపు సంతల్లో విక్రయాలు నిర్వహిస్తున్నామని, పలువురు గ్రామాలకే వచ్చి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని ఎకరాల్లో అల్లం సాగు చేస్తామని పేర్కొంటున్నారు. అల్లం సాగుతో ఆర్థికంగా మేలు జరుగుతోందని చెబుతున్నారు. మెళియాపుట్టి మండలంలోని ఆంపురం, గొట్టిపల్లి, కేరాసింగి, నేలబొంతు గ్రామాల గిరిజనులు, నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఈ ఏడాది అధికంగా సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
మేము దేశవాలీ విత్తనాలు వేసి పండిస్తున్న అల్లంకు చాలా గిరాకీ ఉంది. అదేవిధంగా లాభాలు సైతం అధికంగానే వస్తున్నాయి. కుటుంబాలతో కష్టపడుతున్నాం. ఫలితం కూడా ఆశించిన విధంగానే ఉంది. గతేడాది 50 సెంట్లలో పండించాను. ప్రస్తుతం మరో రెండెకరాల్లో పండించాలని యోచిస్తున్నాం.
– జన్ని భాస్కరరావు,
నేలబొంతు గ్రామం, మెళియాపుట్టి మండలం
అల్లం సాగు చేయడానికి పెట్టుబడులు తక్కువ. నేను ఒక ఎకరాలో పోడు వ్యవసాయం చేస్తున్నాను. అల్లం విత్తనాలను కొత్తూరు వెలుగు అసోసియేషన్ వారు రాయితీపై అందిస్తున్నారు. మేము పండించే అల్లం మాకు ఆర్థికంగా పురోభివృద్ధి చేకూర్చడమే కాకుండా, పలువురుకి ఆరోగ్యం అందిస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు మరింత సహకారం అందించాలి.
– సవర రమేష్,
కేరాసింగి గ్రామం, మెళియాపుట్టి మండలం
గిరిజనులు అధిక శాతం అల్లం పంట పండిచే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. చాలా మంది రైతులకు దీని లాభాలు తెలియజేశాం. రైతులకు అన్నివిధాలుగా.. ఆర్థిక సహకారం అందేందుకు ఉద్యానవన పంటలు పండించాలి. గిరిజనులకు ప్రాధాన్యత కలిగిన మరిన్ని రకాలు చిరు ధాన్యాలు పండించేందుకు కూడా కృషి చేస్తున్నాం.
– మంగమ్మ,
ఉద్యాన శాఖ అధికారి, పాతపట్నం
అల్లం సాగుపై ఆసక్తి..!
అల్లం సాగుపై ఆసక్తి..!
అల్లం సాగుపై ఆసక్తి..!
అల్లం సాగుపై ఆసక్తి..!


