మాయమవుతున్న సాగునీటి కాలువలు..?
టెక్కలి: వంశధార ప్రధాన కాలువ నుంచి టెక్కలి పరిధిలోని పలు గ్రామాల సాగునీటి అవసరాలకు ఆసరాగా ఉన్నటువంటి కాలువలు మాయమవుతున్నాయి. సాగునీటి కాలువలను ఆక్రమిస్తూ అక్రమ కట్టడాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్న విషయం అధికారులు గుర్తిస్తున్నప్పటికీ, వాటిని తొలగించే విషయంలో తాత్సారం కనిపిస్తోంది. దీంతో సాగునీటి కాలువల స్వరూపం మారిపోతోంది. టెక్కలి నుంచి బన్నువాడకు వెళ్లేదారిలో కోదండ రామవీధికి ఎదురుగా 49–1ఆర్ కాలువకు ఆనుకుని కొన్ని నెలల క్రితం ఒక వెంచర్ వేశారు. అప్పట్లో సాగునీటి కాలువను ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. వెంచర్‌కు ఆనుకుని ఉన్న ఆక్రమణలతో పాటు మొత్తం కాలువ ఆక్రమణలు తొలగిస్తామని సంబంధిత అధికారులు హడావుడి చేసి మధ్యలో వదిలేశారు. దీంతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా పాత జాతీయ రహదారిలో గతంలో 49–ఏఆర్‌గా పిలవబడే సాగునీటి కాలువకు ఆనుకుని ఇటీవల ఒక పెద్ద స్థలాన్ని చదును చేశారు. అయితే సాగునీటి కాలువ స్థానంలో మండల పరిషత్ నిధుల నుంచి కాలువల నిర్మాణం చేస్తున్నారు. కాగా గతంలో ఉన్న కాలువకు ఇప్పుడు నిర్మాణం చేస్తున్న కాలువకు పూర్తిగా స్వరూపం మారిపోయింది. కొత్తగా చదును చేసిన స్థలానికి లబ్ధి కలిగే విధంగా సాగునీటి కాలువను మురుగునీటి కాలువలా స్వరూపం మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు పూర్తిగా సర్వే నిర్వహించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ స్థానికంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై వంశధార ఈఈ శేఖర్‌రావు వద్ద ప్రస్తావించగా.. పాత జాతీయ రహదారిలో గతంలో రైతుల ప్రయోజనం దృష్ట్యా 49–ఏఆర్‌తో చానల్ ఉండేదన్నారు. అలాగే బన్నువాడకు వెళ్లే మార్గంలో వేసిన వెంచర్‌కు ఆనుకుని ఉన్నటువంటి 49–1 ఆర్‌లో ఆక్రమణలు గుర్తించామని, దీనిపై రెవెన్యూ అధికారుల సాయంతో తొలగింపు ప్రక్రియ కోసం ఇప్పటికే అన్ని రకాల అనుమతులతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
మాయమవుతున్న సాగునీటి కాలువలు..?


