ఏకోపాధ్యాయ ఎక్కడయ్యా..?
టెక్కలి: కోటబొమ్మాళి మండలంలోని కమలనాభపురం గ్రామ ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ఈ పాఠశాలకు చెందిన ఒకే ఒక్క ఉపాధ్యాయుడు జనవరి 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందారు. అదే రోజున మరో ఉపాధ్యాయుడిని నియమిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉపాధ్యాయుడు మాత్రం విధులకు హాజరవ్వడం లేదు. దీంతో రెండు రోజులు పాటు సీఆర్పీతో నెట్టుకొచ్చారు. కొత్తగా నియమించిన ఉపాధ్యాయుడు బుధవారం సైతం రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లినప్పటికీ పాఠాలు బోధించేవారు కరువయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారి గోవిందరావు పాఠశాలకు వెళ్లి పరిస్థితిని గమనించారు. అనంతరం ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరవ్వని విషయాన్ని విద్యా శాఖాధికారుల వద్ద ప్రస్తావించగా.. ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ పొందిన రోజునే చిన్నహరిశ్చంద్రాపురం పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడ్ని నియమించామన్నారు. అయితే ఆదివారం సెలవు కావడంతో సోమవారం సైతం విధులకు సెలవు పెట్టారని పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల పాటు విధులకు రాకపోవడంతో సీఆర్పీతో పాఠశాలను నిర్వహించామన్నారు. బుధవారం కూడా రాలేదనే విషయం గ్రామస్తులను నుంచి తెలుసుకున్నామని తెలిపారు. తక్షణమే విధులకు హాజరు కావాలని ఆదేశించామని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ విధులకు హాజరవ్వాల్సిన ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు.


