రెయిన్ గన్‌తో సాగునీరు ఆదా
గార: వ్యవసాయంలో రెయిన్ గన్ వాడడం ద్వారా పూర్తిస్థాయిలో పంటకు సాగునీరు అందడంతో పాటు సాగునీరు ఆదా అవుతుందని శ్రీకాకుళం వ్యవసాయ సహాయ సంచాలకురాలు బగ్గు రజిని అన్నారు. బుధవారం రామచంద్రాపురం పంచాయతీ అంబటివానిపేట ఆర్‌ఎస్‌కే పరిధిలోని మొక్కజొన్న, అపరాలు, మిరప మొక్కలకు రెయిన్ గన్‌ద్వారా సాగునీరు అందించే పద్ధతిని రైతులు, అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. మొక్కజొన్న సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారన్నారు. అధికంగా యూరియా వాడడడంతో సూక్షధాతు లోపాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రబీలో ఈ ఏడాది అధికంగా మంచు కురవడంతో పెసర, మినుము పంట పాడయ్యిందని, పూత దశలో మల్టీకే వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో దుంపల పద్మావతి, ఏఈవోలు బడగల దుర్గాప్రసాదరావు, శ్రీదీప్తి, వినీత, అంబటి సుధాకరరావు, సాధు దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.


