● కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పల్లె పాలనకు అధికార పార్టీ నాయకులు తూట్లు పొడుస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన సర్పంచ్‌ల చెక్ పవర్‌ను ఉద్దేశపూర్వకంగా ఆపి ఆ ఊరి ఊపిరి తీసేస్తున్నారు. అధికారులు కూడా వారు చెప్పినట్టే తలూపడంతో ప్రజాస్వామ్య విలువలు నిలువునా కుప్పకూలుతున్నాయి. ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు సర్పంచ్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. చెరువుల ఆక్రమణలను అడ్డుకున్నందుకు అక్కడి సర్పంచ్‌పై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ, తప్పుడు అభియోగాలతో చెక్ పవర్ రద్దు చేశారు. నిబంధనల మేరకై తే ఆరు నెలలకు మించి చెక్ పవర్ రద్దు చేయడానికి లేదు. పునరుద్ధరించాల్సిన అధికారులు నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పది నెలలైనా పునరుద్ధరించలేదు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. అలాగని, ఆ గ్రామానికి సర్పంచ్ స్థానంలో డ్రాయింగ్ ఆఫీసర్‌ను కూడా నియమించలేదు. దీంతో పనులు ఆగిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు.
పొంతన లేని అభియోగాలు
సాధారణంగా ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగమైతే సామాజిక తనిఖీల్లో అభ్యంతరం వ్యక్తమవుతుంది. తేడాలుంటే రికవరీకి ఆదేశిస్తారు. అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. కానీ, ఇక్కడదేమీ జరగలేదు. నిధులు దుర్వినియోగమైనట్టు సామాజిక తనిఖీల్లో ఎక్కడా తేలలేదు. కనీసం దుర్వినియోగం జరిగినట్టు ఉత్తర్వులు కూడా జారీ కాలేదు. పంచాయతీ నిధులకు సంబంధం లేని ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం జరిగినట్టు చూపించి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగమైతేనే సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి. అలాంటిదేమీ జరగకపోయినా ఉపాధి నిధులతో చేపట్టిన సచివాలయం భవన నిర్మాణాన్ని చూపించి, అందులో దుర్వినియోగం అయిందని అభియోగాలు మోపి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారు. ఉపాధి నిధులకు, పంచాయతీ నిధులకు తేడా తెలియదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
అసలు ఏం జరిగింది..
బొంతల కోడూరులో కూటమి నాయకుల చెరువుల ఆక్రమణలకు పాల్పడ్డారు. సర్వే నంబర్ 57–11లో గల చెరువులో రూ.3కోట్లు విలువైన ఎకరా 94 సెంట్లు, సర్వే నంబర్ 39–8లో గల రూ. 5కోట్లు విలువైన 3ఎకరాల చెరువుల ఆక్రమణలను అక్కడ సర్పంచ్ పి.రాంబాబు అడ్డుకున్నారు. ఆక్రమణదారులపై పెద్ద పోరాటమే చేశారు. చివరికి ఆక్రమణలని తేలడంతో అధికారులు సైతం చర్యలు తీసుకున్నారు. కబ్జాదారుల నుంచి చెరువులను కాపాడారు.
నిబంధనలు పాటించని అధికారులు
● తప్పుడు అభియోగాలతో చెక్ పవర్ రద్దు చేసిన అధికారులు, పంచాయతీరాజ్ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు ఉన్నాయి.
● 1995 పంచాయతీరాజ్ చట్టంలోని జీఓ ఎంఎస్ నంబర్ 30 ప్రకారం సర్పంచ్ చెక్ పవర్ రద్దు కాలం గరిష్టంగా ఆరు నెలలే ఉండాలి. తర్వాత పునరుద్ధరించాలి. లేదంటే ఎక్స్‌టెన్షన్ చేసినట్టు ఉత్తర్వులైనా ఇవ్వాలి.
● రద్దు చేసిన కాలంలో డ్రాయింగ్ ఆఫీసర్‌ను నియమించాలి. కానీ జిల్లా అధికారులు ఈ విషయాలేవీ పట్టించుకోలేదు.
● నేటికి 10 నెలలు అవుతున్నా చెక్ పవర్ పునరుద్ధరించలేదు. డ్రాయింగ్ ఆఫీసర్‌ను నియమించలేదు.
● చెక్ పవర్ రద్దుపై ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, 2025నవంబర్ 25న డబ్లూపీ నంబర్ 30010/2025 ఉత్తర్వుల్లో నాలుగు వారాల్లో చట్ట ప్రకారం సర్పంచ్‌కు చెక్ పవర్ పునరుద్ధరించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందని సర్పంచ్ ఉత్తర్వులు చూపిస్తున్నారు. కానీ, అధికారులు హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు.
● కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టే అవుతుందని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని, చట్టం ప్రకారంగా నడుచుకోవాలని, గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినా అధికారులు స్పందించడం లేదు. దీని వెనక కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. వారి ఒత్తిళ్లకు భయపడి అధికారులు చట్ట ప్రకారంగా నడుచుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అయినప్పటికీ సర్పంచ్ రాంబాబు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.
అక్కసుతో కూటమి నాయకులు కక్ష సాధింపునకు దిగారు. అధికారులను అడ్డం పెట్టుకుని ఏకంగా చెక్ పవర్ రద్దు చేయించారు. ఉపాధి హామీ పథకం నిధుల అవతకవకలు అభియోగంతో చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి.. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనక భాగంలో సచివాలయం భవన నిర్మాణ పనులు కలెక్టర్ ఉత్తర్వులతో జిల్లా పరిషత్ సమావేశం తీర్మానం ప్రాప్తికి మొదలుపెట్టారు. అయితే, 2022 జూలైలో ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్మాణం నిలుపుదల చేశారు. అప్పటికే భవన నిర్మాణానికి గ్రామ పంచాయతీకి రూ.1,81,339 నిధులు జమయ్యాయి. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన సచివాలయం భవనాన్ని మరో ప్రదేశంలో నిర్మించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు సచివాలయం పూర్తయ్యి ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. నిలిచిపోయిన సచివాలయం భవన నిర్మాణాన్ని పార్ట్ (ఏ) గా, కొత్త సచివాలయం భవనాన్ని పార్ట్ (బి)గా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు రాటిఫికేషన్ చేసి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రాప్తికి పాత సచివాలయం కాంట్రాక్టర్ మెట్ట హరిహరరావు పేరున రూ.1,81,339లను చెక్ ద్వారా సర్పంచ్ చెల్లించారు. సంబంధిత కాంట్రాక్టర్ కూడా నిధులు దుర్వినియోగం జరిగినట్టు సామాజిక విచారణలో అభ్యంతరం వ్యక్తం చేస్తే మొత్తం నిధులు తిరిగి చెల్లిస్తానని లిఖిత పూర్వకంగా రాసి కూడా ఇచ్చారు. అంతా పక్కా పారదర్శకంగా, ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం నిర్మాణం, నిధుల వినియోగం జరిగితే.. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని కూటమి నాయకులు ఇచ్చిన ఫిర్యాదుకు తలొగ్గి, ఒత్తిళ్లకు లోనై వారు చెప్పినట్టుగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా సర్పంచ్ రాంబాబు చెక్ పవర్‌ను రద్దు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
● కక్ష సాధింపు


