మూసేస్తున్నారు!
మూతపడుతున్న రైతు సేవా కేంద్రాలు
ఇప్పటికే 123 కేంద్రాలకు తాళం
రేషనలైజేషన్ పేరిట సిబ్బంది సర్దుబాటు
అన్నదాతల సమస్యలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
ఒక్కొక్కటిగా..
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గత వైఎస్సార్ సీపీ పాలనలో వ్యవసాయం పండగలా ఉండేది. విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా పథకం, ఇన్‌పుట్ సబ్సిడీ.. ఇలా అనేక రకాల సేవలు రైతు ముంగిటకే చేరేవి. వీటన్నింటికీ కారణం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు. విత్తు నుంచి విపత్తు వరకు అన్నింటా అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచాయి. అంతటి మహత్తరమైన ఆర్‌బీకేలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఇప్పటికే రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే)లుగా పేరు మార్చి రైతులకు సేవలు అందకుండా చేసింది. తాజాగా రేషనలైజేషన్ పేరిట సిబ్బందిని కుదించేసి రైతు సేవా కేంద్రాలను మూసివేసే దిశగా ఆడుగులు వేస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనే ఇప్పటివరకు 123 రైతుసేవా కేంద్రాలు మూసివేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 656 రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. రైషనలైజేషన్ పేరుతో రెండు, మూడు ఆర్‌ఎస్‌కేలను కలిపి ఒకటిగా సర్దుబాటు చేసేశారు. దీంతో కేంద్రాల సంఖ్య 533కి చేరింది. అంటే 123 రైతు సేవాకేంద్రాల సేవలకు సెలవిచ్చేశారు. ఇందులో 515 గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా మరో 18 అర్బన్ స్టేషన్లలో ఉన్నాయి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లతోపాటు విలేజ్ సెరికల్చర్ సిబ్బంది పనిచేస్తూ రైతులకు సేవలందిస్తున్నారు. ఇందులో సుమారు 52 మంది ప్రస్తుతానికి పలు కారణాల వల్ల సిబ్బంది లేనట్లు అధికారికంగా చెబుతున్నారు. కొందరు పదోన్నతులపై వెళ్లగా మరికొందరు ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం 481 మంది సిబ్బంది మాత్రమే రైతు సేవా కేంద్రాలలో సేవలందిస్తున్నారు.
సిబ్బంది కొరత..
జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఆయా భూముల పరిధిలోని రైతులకు సేవలందించేందుకు ఒక్కో ఆర్‌ఎస్‌కేకు ఒక్కో వీఏఏ/ వీహెచ్‌ఎ ఉండాల్సి ఉండగా అనేకచోట్ల సిబ్బంది కొరత ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో రైతు సేవా కేంద్రం పరిధిలోకి 1400 హెక్టార్ల భూమిని కేటాయించారు. సిబ్బంది కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో సేవలు సరిగ్గా అందడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో రైతు ఇంటి వద్దకే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేవి. రైతుభరోసా–పీఎం కిసాన్ పెట్టుబడి సాయం ప్రతీ సీజన్‌లో ఠంచన్‌గా రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అగ్రిల్యాబ్‌ల్లో పరీక్షలు సైతం నిర్వహించడం లేదు. ఇప్పటికే యూరియా ఇవ్వడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పుడు రైతుసేవా కేంద్రాలు మూసివేస్తుండటం దారుణం.
– గొండు రఘురాం,
వైఎస్సార్ సీపీ వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు
రైతులకు సక్రమంగా సేవలందించాలన్న ఆలోచనతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే విలీనం పేరుతో వాటిని తగ్గించేసి రైతులకు ఇబ్బంది పెట్టడం సరికాదు. హిరమండలంలో మూడు రైతు భరోసా కేంద్రాలకు గాను ఒకటికి తగ్గించేశారు. 400 మంది రైతులు ఒకే ఆర్‌బీకేకు వెళ్లి ఇబ్బంది పడాల్సి వస్తోంది. సేవలు దూరం చేసేలా రైతులపై కక్షసాధింపు చర్యలు తగవు.
– నక్క ఆనందరావు,
పాత హిరమండలం
రేషనలైజేషన్ వల్ల ఆర్‌ఎస్‌కేలు తగ్గాయి. సిబ్బందిని తగ్గించాం. ప్రభుత్వం నిర్ణయాన్ని అమలుచేశాం. రైతులకు సేవలు అందించడంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. భవిష్యత్‌లో ఎటువంటి సేవలు అందించామో ఇప్పుడే అలానే అన్ని రకాల సేవల్ని అందిస్తున్నాం. ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలి.
– త్రినాథస్వామి,
జిల్లా వ్యవసాయాధికారి
మూసేస్తున్నారు!
మూసేస్తున్నారు!


