ఆగని ఇసుక దందా
● బాహుదానదిని ఊడ్చేస్తున్న ఇసుకాసురులు ● ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు
ఇచ్ఛాపురం: ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బాహుదా నది నుంచి అక్రమార్కులు ఇసుకను దోచేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్నప్పుడు, వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే స్థానిక అధికారులు దాడులు చేస్తున్నారు. తర్వాత పట్టించుకోకపోవడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. దర్జాగా అక్రమ రవాణా చేసుకుంటూ జేబులు నింపుకొంటున్నారు. స్థానిక బాహుదానది నుంచి అక్రమార్కులు నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారు. నది సమీప ప్రాంతాలు, తోటల్లో డంప్ చేసుకొంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.
అనుమతులు లేకుండానే..
ఇచ్ఛాపురం మండలంలో బాహుదానది పరివాహక ప్రాంతంలో ఎక్కడా ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయలేదు. అయినప్పటికీ ప్రజల అవసరాల నిమిత్తం నిర్మాణం కోసం ఎడ్లబండి, ట్రాక్టర్లతో ఇసుకను తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఇదే అదునుగా అక్రమార్కులు నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నదిలో ఇసుక లేకపోతే భవిష్యత్‌లో సాగునీరు, వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ముందుగానే గుర్తించిన బెల్లుపడ రైతులు నదీ దారుల్లో డిసెంబర్‌లో పెద్ద పెద్ద గోతులు తవ్వించారు. అయినప్పటికీ ఇసుకాసురులు కొత్త మార్గాలను అన్వేషిస్తూ తవ్వకాలు సాగిస్తున్నారు. నదిలో తవ్వకాలు చేపట్టకూడదని రెవెన్యు సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోతోంది.
అడిగే వారేరీ?
బాహుదా నది నుంచి ఇసుకను తరలించేందుకు ఇసుకాసురులు ఉపయోగించే ట్రాక్టర్ ఇంజిన్‌కు గానీ, ట్రాక్టర్ తొట్టెకు గాని ఎటువంటి నంబర్లు ఉండవు. వీటికి ఎటువంటి అనుమతులు కూడా ఉండవు. ఇటువంటి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను నిత్యం పట్టణంలోని రెవెన్యు కార్యాలయం, పోలీస్ స్టేషన్ ముందుగానే తరలిస్తున్నా అడిగేవారే కరువయ్యారు. ఇప్పటికై నా మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ప్రకృతి సంపద తరలిపోకుండా, ప్రజలకు నీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆగని ఇసుక దందా
ఆగని ఇసుక దందా
ఆగని ఇసుక దందా


