కలకలం రేపిన కబ్జా
కూటమి నేతల ప్రయత్నాలు నిజమే: ఎమ్మెల్యే బగ్గు
నరసన్నపేట: ప్రముఖ వాణిజ్య కేంద్రం నరసన్నపేట నడిబొడ్డున జిల్లా పరిషత్‌కు చెందిన (బోర్డుబంగ్లా) స్థలాన్ని కూటమి నాయకులు కాజేయడానికి ప్రయత్నాలు చేపట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. విలువైన ఈ ఆస్తిపై శ్రీకాకుళంకు చెందిన కూటమి నాయకులు కన్నేశారని, ఇది వారి పరమవుతుందనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ‘కోట్లు విలువైన స్థలం.. కొట్టేసేందుకు సిద్ధం’ అనే శీర్షికన శనివారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో ఒక్కసారిగా నరసన్నపేట ప్రజలు, రాజకీయ పక్షాలు ఉలిక్కిపడ్డాయి. అయ్యో.. ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వస్తున్న ఈ స్థలమూ కబ్జాకు గురవుతుందా..అంటూ పలువురు ఆవేదన వెలిబుచ్చారు. ఉదయం నుంచీ ఈ వ్యవహారంపై చర్చ జరగడంతో అధికారుల్లో ఒక్కసారి చలనం వచ్చింది. ఆక్రమణ కట్టడికి చర్యలు మొదలెట్టారు. ఎంపీడీఓ ప్రసాద్ న్యాయ సలహా కోసం న్యాయవాదులను సంప్రదించారు. ఈ వ్యవహరంపై కలెక్టర్, జెడ్పీ సీఈఓ దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు.
బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణపై నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాం. ముద్డాడ గోవిందరాజులు అనే వ్యక్తి గురువారం రాత్రి వచ్చి గోడ కూల్చి స్థలాన్ని దౌర్జన్యంగా చదును చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాం.
– ప్రసాద్,
నరసన్నపేట ఎంపీడీఓ
ఈ వ్యవహారంపై స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు నరసన్నపేట పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళి, మండల పార్టీ అధ్యక్షులు లుకలాపు రవి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కనపల శేఖరరావు తదితరులు మాట్లాడుతూ కూటమి నాయకుడు కొర్ను ప్రతాప్ హస్తం దీంట్లో ఉందని ఆరోపించారు. ఆమదాలవలసకు చెందిన వ్యక్తి నుంచి ప్రతాప్ కొనుగోలు చేశారని విమర్శించారు. రాత్రిపూట వచ్చి స్థలాన్ని చదును చేయడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి నరసన్నపేటలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఈ స్థలాన్ని అన్ని విధాలా కాపాడామని, అధికారులకు సైతం పూర్తి అండగా ఉన్నామని గుర్తు చేశారు. విలువైన ఈ స్థలం కబ్జాకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
ఈ వ్యవహారంపై నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం స్పందించి వీడియో రిలీజ్ చేశారు. బోర్డు బంగ్లా స్థలం కాజేయడానికి కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నది వాస్తవమేనని అంగీకరించారు. భూమి విషయమై తన వద్దకూ వచ్చారని, అందుకు తాను ఒప్పుకోలేదని చెప్పారు. బోర్డు బంగ్లా స్థలం కాపాడటంలో అధికారుల ఉదాసీన వైఖరిని సైతం తప్పుపట్టారు. పరిస్థితి ఇంతవరకు రావడానికి అధికారులే బాధ్యులని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ముమ్మాటికీ జిల్లా పరిషత్‌కు చెందినదని స్పష్టం చేశారు.
నరసన్నపేట బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణపై అలజడి
కూటమి నేతల ప్రమేయాన్ని అంగీకరించిన ఎమ్మెల్యే బగ్గు
ఆక్రమణ దందాకు అడ్డుకట్ట వేయాలన్న వైఎస్సార్ సీపీ నాయకులు
న్యాయపరంగా ఎదుర్కోవడానికి అధికారుల సన్నాహాలు
కలకలం రేపిన కబ్జా
కలకలం రేపిన కబ్జా


