ఉపాధికి చంద్ర గ్రహణం
హిరమండలం : ఉపాధి హామీ పథకం పేరు, తీరు రెండూ మారనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త పథకం ద్వారానే ఉపాధి హామీ కొనసాగనుంది. అయితే నిధుల వాటాలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పథకం సక్రమంగా అమలుకావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గర్ అండ్ అజవీక మిషన్ గ్రామీణ –2025 (వీబీజీ రామ్‌జీ )గా పేరు మార్చిన విషయం తెలిసిందే. పథకం పేరు మార్పు అటుంచితే.. నిధుల వాటాలో గతంలో పోల్చుకుంటే భారీగా తేడాలున్నాయి. 13 ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి పాత నిధులు వెచ్చించే విధంగానే మినహాయింపు ఇచ్చారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు మినహాయింపు ఇచ్చిన రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రాన్ని చేర్చుకోలేకపోవడం తీవ్ర వైఫల్యంగా పలువురు పరిగణిస్తున్నారు.
జిల్లాలో వ్యయం రూ.800 కోట్లు..
ఉపాధి హామీ పథకానికి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.800 కోట్లు ఖర్చు కాగా, ఇందులో పనులకు హాజరైన 5,86 లక్షల మంది వేతనదారులకు, నిర్మాణాత్మక పనులకు ఈ మొత్తాన్ని వ్యయం చేస్తారు. అయితే ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కూలీలకు పూర్తిగా వేతనం చెల్లించేది. ప్రస్తుత కొత్త పథకంలో వేతనదారులకు 40 శాతం రాష్ట్రమే వాటా చెల్లించాల్సిఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.800 కోట్లలో రూ.320 కోట్లు రాష్ట్రం వాటా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనిదినాలు 100–125 రోజులకు పెంచడం వల్ల ఈ వాటా పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారం మోపుతూ తీసుకొచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ చట్టం వల్ల అటు రాష్ట్రాలకు ఇటు పేదలకు నష్టదాయకం. ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలి. గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలి.
– సిర్ల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు
జిల్లాలో 4.35 లక్షల జాబ్‌కార్డులు
ప్రస్తుత నిధుల వాటా ప్రకారం రాష్ట్రంలో పథకం నిర్వహణ గగనమే
13 రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చిన కేంద్రం
అందులో చోటు దక్కించుకోవడంలో చంద్రబాబు వైఫల్యం
ఉపాధికి చంద్ర గ్రహణం


