మధ్యవర్తిత్వంతో కేసులకు మోక్షం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సత్వరమే పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఎంపిక చేసిన న్యాయవాదులకు ఐదు రోజులుగా నిర్వహిస్తున్న 40 గంటల ప్రత్యేక శిక్షణా తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వ ప్రక్రియలో మెలకువలు నేర్చుకోవడం వల్ల న్యాయవాదులకే కాకుండా, కక్షిదారులకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన న్యాయవాదులు ఈ ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించాలని, ఉభయ పక్షాల అంగీకారంతో కేసులను పరిష్కరించి ప్రజలకు భారం తగ్గించాలని సూచించారు. సీనియర్ ట్రైనర్లు వి.పి.తనకచన్, పి.జి.సురేష్‌లు పాల్గొని మధ్యవర్తిత్వంలోని న్యాయపరమైన చిక్కులు, వాటిని పరిష్కరించే విధానాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


