ప్రయోగాలకు వేళాయె!
రేపటి నుంచి ఫిబ్రవరి 10 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జిల్లాలో 119 పరీక్ష కేంద్రాల్లో నిర్వహణ
హాజరుకానున్న 15432 మంది విద్యార్థులు
ఏర్పాట్లు పూర్తిచేశాం..
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ సైన్స్ విద్యార్థుల ప్రాక్టికల్స్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి ఒకటి నుంచి మొదలుకానున్న ప్రాక్టికల్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే కేంద్రాలకు బుక్‌లెట్స్, ఇతర సామగ్రి చేరవేశారు. ఆర్‌ఐఓ రేగ సురేష్‌కుమార్ నేతృత్వంలో డీఈసీ కమిటీ ఏర్పాట్లలో నిమగ్నమైంది.
నిఘా నడుమ పరీక్షలు..
ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో అధికారులు నిఘా పెట్టారు. ఇందుకోసం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లతోపాటు డీఈసీ కమిటీ సభ్యులు బి.శ్యామ్‌సుందర్, ఎస్.భీమేశ్వరరావు, ఎస్.అన్నపూర్ణారావు, బీటీవీ మంగపతి, ఇంటర్‌బోర్డు అధికారులు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. సీసీ కెమెరాలతో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేయడంతో వాటిని ఇంటర్‌బోర్డు సెక్రటరీ/సీఓఈ అధికారులతోపాటు జిల్లా ఆర్‌ఐఓ కార్యాలయానికి స్ట్రీమింగ్ చేశారు. కాగా, మెజారిటీ కాలేజీల్లో విద్యార్థుల నుంచి రూ.500 నుంచి 800 వరకు ‘కలెక్షన్స్’కు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 119 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. వీటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 37, మోడల్ స్కూల్/కాలేజీలు 13, సోషల్ వెల్ఫేర్ 8, ట్రైబల్ వెల్ఫేర్ 1, ప్రైవేటు అన్ ఎయిడెడ్ మరో 60 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 15432 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు సన్నద్ధమౌతున్నారు. ఎంపీసీ గ్రూపు నుంచి 10626 మంది, బైపీసీ గ్రూపు నుంచి 4806 మంది విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్లు, ఇతర సిబ్బంది నియామకాలు పూర్తిచేశారు. అయితే కొంతమంది లెక్చరర్లు/ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్లను సుదూర ప్రాంతాలకు ఎగ్జామినర్లగా నియామకాలు చేయడంతో వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఒకటో తేదీ నుంచి మొదలయ్యే సైన్స్ ప్రాక్టికల్ పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టిక ల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రేగ సురేష్‌కుమార్, జిల్లా ఆర్‌ఐఓ
ప్రయోగాలకు వేళాయె!


