కొత్తపాలేంలో అధికారుల పర్యటన
కవిటి: మండలంలోని కొత్తపాలేం గ్రామంలో నెలకొన్న తాగునీటి ఇబ్బందులపై ‘ఏం నేరం చేశామని’ శీర్షికతో సాక్షి దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ ఏవీ మురళీమోహనరావు, మండల ఇంజినీర్ బి.వంశీ గ్రామంలో బుధవారం పర్యటించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న దయనీయ పరిస్థితులు చూసి తక్షణ చర్యలకు సిద్ధమయ్యారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ.3.50 లక్షల వ్యయంతో ప్రస్తుతం ఉన్న మినీ వాటర్ ట్యాంకర్‌తో పాటు మరొకటి ఇసుక దిబ్బలున్న వీధికి సమీపంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి మండల పరిషత్‌కు అందించారు. అదేవిధంగా గ్రామంలో ఇంటింటికీ కుళాయిల నిర్మాణాలకు కీలకమైన 20,000 లీటర్ల పరిమాణం కలిగిన ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంకర్ నిర్మాణానికి ఇప్పటికే రూ.26.85 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులు టెండర్ దశకు చేరుకున్నాయన్నారు. ఈ పనులు సాధ్యమైనంత త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. తక్షణ నీటి అవసరాల కోసం మండల పరిషత్ అధికారులు ట్యాంకర్‌తో నీటిని పంపిణీ చేయించారు.
ట్యాంకర్‌తో నీటిని పంపిణీ చేస్తున్న దృశ్యం
కొత్తపాలేంలో అధికారుల పర్యటన


