దుఃఖాన్ని దిగమింగుతూ..
● భర్త మృతదేహానికి భార్య అంత్యక్రియలు
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాపువీధిలో భర్త మృతదేహానికి దుఃఖాన్ని దిగమింగుతూనే భార్య అంత్యక్రియలు నిర్వహించిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాపు వీధికి చెందిన బడబందల అభి(48) కడుపు నొప్పితో బాధపడుతూ అస్పత్రితో చేరి మంగళవారం మృతి చెందారు. భర్త మృతి చెందడంతో అగ్ని సాక్షిగా వేదమంత్రాల నడుమ తాళి కట్టించుకున్న భార్య లక్ష్మి అన్నీతానై పుట్టెడు దుఃఖంలో తన భర్త చితికి నిప్పుపెట్టి అంత్యక్రియలు చేపట్టింది. దివ్వాంగుడైన మృతుడు వాచ్ మెకానిక్ వృత్తిని నమ్ముకొని భార్య, బిడ్డలను పోషించేవాడు. అయితే ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం వీధిన పడిందని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు.


