రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నరసన్నపేట: స్థానిక పాత స్టేట్ బ్యాంకు వీధికి చెందిన శాంతామణి రైస్ ఇండస్ట్రీస్ యజమాని ఊణ్ణ వెంకటరమణమూర్తి(67) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విశాఖపట్నంలోని మద్దెలపాలెం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటరమణమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. వైద్య పరీక్షల కోసం నరసన్నపేట నుంచి విశాఖపట్నం సోమవారం వెళ్లారు. రాత్రి తన కుమార్తె మౌనిక ఇంటి వద్ద ఉన్నారు. ఉదయం మార్కెట్‌కు కూరగాయలు కొనేందుకు స్కూటీపై వెళ్తుండగా విజయనగరం నుంచి విశాఖ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందారు. ఆయన నరసన్నపేటలో మిల్లర్‌గా మంచి గుర్తింపు పొందారు. ఈయన కుమారుడు భార్గవ్ నరసన్నపేట మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. వెంకటరమణ మూర్తి మృతికి వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్మాన రామదాస్, మిల్లర్ల సంఘం పూర్వపు జిల్లా అధ్యక్షులు తంగుడు జోగారావు తదితరులు సంతాపం తెలిపారు. ఆయనకు భార్య శశికళ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


