జిల్లా పరిషత్ వార్షిక బడ్జెట్ రూ.1743.35 కోట్లు
● 2026–27 అంచనా బడ్జెట్‌గా సభ్యుల ఆమోద తీర్మానం
● జెడ్పీకి రావాల్సిన ఆదాయంపై దృష్టిపెట్టాలన్న జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ
అరసవల్లి: జిల్లా పరిషత్ ఆదాయ, వ్యయాల ఆధారంగా 2025–26 సవరణ బడ్జెట్, 2026–27 అంచనా బడ్జెట్ ప్రతిపాదనలకు జిల్లా పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించింది. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయ అధ్యక్షతన మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ సమక్షంలో సంబంధిత అక్కౌంట్స్ ఏఓ పక్కి రేణుకాదేవి బడ్జెట్ ప్రతిని సమావేశంలో చదివి వినిపించారు. ఈ మేరకు 2025–26 సవరణ బడ్జెట్ ఆదాయం రూ.1718,85,20,770 కాగా, వ్యయం రూ.1648,67,29,256 గానూ మిగులుగా రూ.70,17,91,514 గా పేర్కొన్నారు. అలాగే 2026–27 గాను అంచనా బడ్జెట్‌గా ఆదాయం రూ.1743,35,73,076 కాగా, వ్యయం రూ.1671,70,96,144, మిగులుగా రూ.71,64,76,932 గా చూపించి ప్రతిపాదించారు. అయితే ఈ అంచనా బడ్జెట్‌లపై ఎలాంటి అభ్యంతరాలు, వివరణలు లేవనెత్తకపోవడంతో హజరైన సుమారు 26 మంది జెడ్పీటీసీలు బల్లలు చరిచి తమ ఆమోదాన్ని తెలియజేశారు. దీంతో 2026–27 అంచనా బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ ప్రకటించారు. అయితే జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ తదితర ఐదు విభాగాలతో పాటు జిల్లా పరిషత్‌కు వస్తున్న ఆదాయ, వ్యయాలను అంచనాలు వేసి ఇంత మొత్తంలో ఈ బడ్జెట్‌ను తయారు చేసినట్లుగా సీఈఓ సత్యనారాయణ తెలియజేశారు. కేవలం జెడ్పీకి సీనరేజి ఫీజు, సర్‌చార్జి ఆన్ స్టాంప్ డ్యూటీ, రూ.4 చొప్పున తలసరి ఆదాయంతో పాటు అద్దెలు–ఇతరత్రా మార్గాల ద్వారానే జెడ్పీకి ఆదాయం (రాబడి) రానుందని, ఈమేరకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులంతా సకాలంలోనే జెడ్పీకి ఆదాయం వచ్చేలా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ విజయ సూచించారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్లు సిరిపురపు జగన్మోహనరావు, పాలిన శ్రావణి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


