ఏసీబీ వలలో ఉప ఖజానా సిబ్బంది
● రూ. 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని జిల్లా ఉప ఖజనా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్టీఓ, సీనియర్ అకౌంటెంట్‌లు కలిసి సచివాలయ ఉద్యోగి ఎరియర్స్ బిల్లుకు సంబంధించి లంచం డిమాండ్ చేయడంతో నేరుగా ఏసీబీకి దొరికారు. విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్ రమణమూర్తి అందించిన వివరాలు మేరకు.. శ్రీకాకుళం పరిధిలోని కిల్లిపాలెం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హేమ రాగిణి తన ఉద్యోగానికి సంబంధించిన ఎరియర్స్ బిల్లు 2023, 24, 25 సంవత్సరాలకు సంబంధించిన రూ. 4,34,000 బిల్లు చేయాలంటూ ఈ నెల 10న జిల్లా ఉప ఖజానా కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. బిల్లును రిజర్వ్ బ్యాంక్‌కు ఫార్వర్డ్ చేసేందుకు గాను పరిశీలించిన ఎస్టీఓ రవిప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ ఎ.శ్రీనివాసరావులు ఆమెను చాలాసార్లు తిప్పించారు. ఈ నెల 22న మరోసారి తన బిల్లు పాస్ కాలేదని హేమ రాగిణి అధికారులను కలిశారు. బిల్లు చేయడానికి రూ.20వేలు లంచం అడిగారు. అంత పెద్ద మొత్తంలో ఇవ్వలేను అనడంతో చివరిగా రూ.15వేలకు కుదించారు. దీంతో నేరుగా ఆమె ఏసీబీ అధికారులకు ఈనెల 26న కలిసి విషయం తెలియజేశారు. వారు చెప్పిన విధంగా మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఉప ఖజానా సిబ్బంది ఎస్టీఓ రవిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావులకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. వీరిని బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఏసీబీ సహాయకులుగా సీఐ కె.భాస్కరరావు, ఎస్‌వీ రమణలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


