గణతంత్రమే స్ఫూర్తి మంత్రమై.. | - | Sakshi
Sakshi News home page

గణతంత్రమే స్ఫూర్తి మంత్రమై..

Jan 27 2026 9:33 AM | Updated on Jan 27 2026 9:33 AM

గణతంత

గణతంత్రమే స్ఫూర్తి మంత్రమై..

డాగ్‌ షో అదుర్స్‌

దేశభక్తి గీతాల్లో ఉద్వేగం..

నాట్య ప్రదర్శనల్లో ఉత్సాహం..

జాగిలాల కదలికల్లో చురుకుదనం..

కలగలిపి గణతంత్ర దినోత్సవం మంత్రముగ్ధుల్ని చేసింది. కవాతు నుంచి శకటాల వరకు,

నృత్యాల నుంచి స్టాళ్ల ప్రదర్శన వరకు,

విరాళాల నుంచి సత్కారాల వరకు ఈ వేడుక అన్ని

దశల్లోనూ అదరహో అనిపించింది. వినువీధిన ఎగిరిన మువ్వన్నెల పతాకం సాక్షిగా గణతంత్రం స్ఫూర్తిమంత్రమై ప్రతిధ్వనించింది.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌, పీఎన్‌ కాలనీ: జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో 77వ గణతంత్ర వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగా యి. ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బృందాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాంతికి చిహ్నంగా కలెక్టర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిలతో కలిసి గాలిలోకి పావురాలు, రంగురంగుల బెలూన్లను వదిలారు.

వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాయుధ దళాల పరేడ్‌ ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా సాయుధ పోలీస్‌ దళం (ఎచ్చెర్ల) రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శంకర్‌ ప్రసాద్‌ పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించగా, పరేడ్‌ బృందాలు గంభీరంగా అడుగులు వేశాయి. 1000 మంది విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సాంస్కృతిక కార్యక్రమాలు

● న్యూ సెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థులు ‘మూడు రంగుల జెండా’, శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ ‘జయతు జయతు భారతం’ గీతాలకు చేసిన నృత్యాలు అలరించాయి. లావేరు కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’, శ్రీ సాయి విద్యామందిర్‌ ’ఈ జెండా అమరుల తుది శ్వాసరా’ ప్రదర్శనలు వీరజవాన్ల త్యాగాలను స్మరింపజేశాయి.

● ఐటీడీఏ ట్రైబల్‌ వెల్ఫేర్‌ విద్యార్థులు తమ సంప్రదాయ గీతంతో, అంబేడ్కర్‌ గురుకులం విద్యార్థులు ‘హమ్‌ ఇండియా వాలే’ నృత్యంతో ఆకట్టుకున్నారు.

● సీతంపేట ఐటీడీఏ పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ విద్యార్థులు నృత్య ప్రదర్శనతో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. న్యూ సెంట్రల్‌ పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతిని సాధించగా, కేజీబీవీ లావేరు విద్యార్థులు తృతీయ బహుమతిని అందుకున్నారు.

సాయం.. సత్కారం

భరతమాత ముద్దుబిడ్డలైన దేశ రక్షకుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, శాసన సభ్యులు గొండు శంకర్‌ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా యోగా గురువు, రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ సభ్యులు యోగా రామారావు ఉచిత గురుకుల సంస్థ (హైదరాబాద్‌) సహకారంతో ‘జాతీయ రక్షణ నిధి’కి ప్రకటించిన లక్ష రూపాయల చెక్కును సోమవారం ఆర్ట్స్‌ కళాశాల గణతంత్ర వేడుకల సభలో అందజేశారు.

● గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర యోధులు కోరాడ రవీంద్రనాగ్‌ (శ్రీకాకుళం), మంత్రి అప్పలస్వామి కుమారుడు నరసింహమూర్తిలను సత్కరించారు.

● అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మొత్తం 150 మంది అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించారు.

కార్యక్రమంలో డాగ్‌ షో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా ఎనిమిదేళ్ల ‘మున్నా’ కలెక్టర్‌కు, నాలుగేళ్ల ‘బ్యూటీ’ ఎస్పీకి పుష్పగుచ్ఛాలు అందించి గౌరవవందనం చేశాయి. అనంతరం డైసి, మున్నా, బ్యూటీలు కలిసి చేసిన ‘ఒబీడియన్స్‌ డ్రిల్‌’, రెండేళ్ల రోజా చేసిన అద్భుతమైన ‘హార్డిల్‌ జంప్‌’, అగ్నికీలల మధ్య నుంచి దూకడం, బ్యూటీ ప్రదర్శించిన ‘పేపర్‌ అండ్‌ మిల్క్‌ ఎక్సర్‌సైజ్‌’ విన్యాసాలు చూసి మైదానం చప్పట్లతో మార్మోగింది. హ్యాండ్లర్లు ఎల్‌.మాధవరావు, కె.ఈశ్వరరావు, సీహెచ్‌ జనార్దన, వి.కోదండరావుల పర్యవేక్షణలో ఈ జాగిలాలు తమ ప్రతిభను ప్రదర్శించాయి.

ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

కన్నులపండువగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

ఆకట్టుకున్న శకటాల ఊరేగింపు

గణతంత్రమే స్ఫూర్తి మంత్రమై.. 1
1/4

గణతంత్రమే స్ఫూర్తి మంత్రమై..

గణతంత్రమే స్ఫూర్తి మంత్రమై.. 2
2/4

గణతంత్రమే స్ఫూర్తి మంత్రమై..

గణతంత్రమే స్ఫూర్తి మంత్రమై.. 3
3/4

గణతంత్రమే స్ఫూర్తి మంత్రమై..

గణతంత్రమే స్ఫూర్తి మంత్రమై.. 4
4/4

గణతంత్రమే స్ఫూర్తి మంత్రమై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement