సోకు నేతలది
సొమ్ము
దాతలది..
ఒక్క పైసా ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం
రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండగగా గుర్తించిన చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు. గత ఏడాది మూడు రోజులకు ఎలాగైతే మొండి చేయి చూపిందో.. ఈ సారి వారం రోజుల పండగకు అదే రకంగా నిధులు ఇవ్వకుండా చేతులేత్తేసింది. ఎలా చేసుకుంటారో అనవసరం, రాష్ట్ర పండగగా, అత్యంత వైభవంగా చేసి, అదంతా ప్రభుత్వ గొప్పతనంగా చాటి చెప్పాలని మాత్రం మౌఖికంగా ఆదేశించింది. ఇంకేముంది కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే రంగంలోకి ది గారు. జనం సొమ్ముతో సంబరాలు చేయాల ని నిర్ణయించారు. నిధుల సమీకరణకు అధికారులను వాడారు. అవకాశం ఉన్న చోటల్లా విరాళాలు సేకరించి ఉత్సవాలను చేశారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రథ సప్తమి వేడుకల వెనుక దాగిన విషయాలు విస్మయం గొలుపుతున్నాయి. ఏడు రోజుల కార్యక్రమాల్లో హడావుడి చేసిన నేతలు ప్రభుత్వం నుంచి తెచ్చిన డబ్బులు సున్నా అంటే అతిశయోక్తి కాదు. దాతలు ఇచ్చిన సొమ్ముతో నేతలు సోకులు చేసుకున్నారు. కేవలం ప్రజల సొమ్ముతో వారం రోజుల రథసప్తమి వేడుకలు చేశారు. అంతా తామే చేసినట్టు వేదికలపై ఫోజులిచ్చారు. ఏడు రోజుల రాష్ట్ర పండగగా జీఓ ఇచ్చి చేతులు దులుపుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు. కానీ వేడుకల వైభవం తమ గొప్పతనమని ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఉత్సవాల భారమంతా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలే మోశారు. జనం సొమ్ముతో ఉత్సవాలు ఎలా చేయాలో? తమది కాని సొమ్ముతో ఎలా క్రెడిట్ కొట్టేయాలో కేంద్ర, రాష్ట్రమంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే చేసి చూపించారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం పోయి రథసప్తమి రోజున సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఫండ్స్ సేకరణకు తొలిసారిగా కమిటీ ఏర్పాటు
ఏడు రోజుల రథసప్తమి వేడుకల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను వివిధ వర్గాల ఆర్థిక సహకారంతో నిర్వహించాలని నిర్ణయించడ మే తరువాయి ఫండ్స్ సేకరణకు ఏకంగా కమిటీని నియమించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఏకంగా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒక పండక్కి ప్రజల నుంచి నిధులు సమీకరించేందుకు కమిటీని ఏర్పాటు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఎక్కడా చూసిన సందర్భాలు కనబడలేదు. కానీ, తొలిసారి మన జిల్లాలో విరాళాలు సేకరించేందుకు జిల్లా స్థాయి అధికారులతో కమిటీని నియమించారు. ఆదాయం వచ్చే శాఖలను ఎంచుకున్నారు. సంబంధిత అధికారులకు తప్పనిసరిగా నిధులు సేకరించే బాధ్యతను అప్పగించారు. గ్రానైట్ మైనింగ్ పరిశ్రమల నుంచి నిధుల సేకరణకు మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్‌ను, వ్యాపారుల నుంచి నిధుల సేకరణకు వాణిజ్య పన్నుల శాఖకు చెందిన డిప్యూటీ కమిషనర్‌ను, నగరంలోని పలు సంస్థలు, వ్యాపారుల నుంచి నిధుల సేకరణకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను, వివిధ రకాల పరిశ్రమల నుంచి నిధుల సేకరణకు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్‌ను, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌ను, కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్‌ను, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ను, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యుల నుంచి నిధుల సేకరణకు జిల్లా ఆస్పత్రుల సర్వీసెస్ కో ఆర్డినేటర్‌ను సభ్యులుగా నియమిస్తూ జిల్లా స్థాయిలో ఫండ్స్ సేకరణకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా తమకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంలో తమవంతు కృషి చేశారు. ఆ వచ్చిన సొమ్ముతోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ముస్తాబుకు కూడా..
నగరాన్ని ముస్తాబు చేసేందుకు వివిధ శాఖలకు బాధ్యత అప్పగించారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు రాకపోవడంతో ఆయా శాఖలు కూడా తమతో అవసరమైన వారి వద్ద నుంచి నిధులు సేకరించి నగరాన్ని ముస్తాబు చేశారు. చెప్పాలంటే ముస్తాబు కోసం ప్రైవేటు వ్యక్తుల చేతి చమురు వదిలించుకోవల్సి వచ్చింది. భారీగా సమీకరించిన నిధులతో హంగులు, ఆర్భాటాలు చేశారు. ఉన్నత స్థాయి ఆదేశాలు, తప్పక చేయాల్సిందే, సహకరిస్తేనే పండగ చేయగలమంటూ సంబంధిత వ్యక్తులపై ఒత్తిడి తెచ్చి ఆ మేరకు నిధులు సేకరించి నగరంలో సొబగులు అద్దారు.
ఫ్యామిలీ పండగలా..
వారం రోజుల జరిగిన వేడుకలను పరిశీలిస్తే రాష్ట్ర పండగగా కన్నా ఒక ‘ఫ్యామిలీ’ పండగ వాతావరణం కన్పించింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పా టు స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత ఇమేజ్ కోసమే నిర్వహించినట్టు ఫోకస్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల వేదికలపై ఎంతసేపూ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, గొండు శంకర్ భజ నే వినిపించింది. వారి డిజిటల్ సైన్ బోర్డులు, సెల్ఫ్ డిస్‌ప్లేలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రముఖుల సొ మ్ముతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అయినప్పటికీ వేదికలపై వారి గొప్పలే కనిపించా యి. యాంకర్స్ కూడా వారి కోసమే ఆద్యంతం పొగుడుతూ కార్యక్రమాలు కొనసాగించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కార్యక్రమం ప్రారంభం కావాలంటే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రావాలని, ఆయన వచ్చాకనే ప్రారంభమవుతుందని వేదికపై యాంకర్ చెప్పడం గమనర్హం. వారం రోజుల వేడుకలను పబ్లిసిటీ కోసం వాడుకున్నారు. వ్యక్తి పూజ కోసం ప్రాధాన్యత ఇచ్చారు. పబ్లిసిటీ పిచ్చిలో రథసప్తమి రోజున ఏర్పాట్లను గాలికొదిలేశారు. భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.
ప్రముఖుల డబ్బుతోనే వేడుకలు
వివిధ వర్గాల నుంచి సేకరించిన సొమ్ముతో అట్టహాసంగా కార్యక్రమాలు
ఫండ్స్ సేకరణకు ప్రత్యేక కమిటీని నియమించిన జాయింట్ కలెక్టర్
ఆ సొమ్ముతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
గొప్పతనమంతా తమదే అన్నట్టు నేతల హడావుడి


