ఆదిత్యుని ఆదాయం రూ. 1.06 కోట్లు
● గతేడాది కంటే రూ.35.70 లక్షలు పెరిగిన ఆదాయం
అరసవల్లి: రథసప్తమి సందర్భంగా ఆలయానికి వివిధ టిక్కెట్లు ద్వారా ఒక్క రోజులో రూ. 1,06,09,720 వరకు ఆదాయం లభించినట్లుగా ఆలయ ఈఓ కెఎన్‌వీడీవీ ప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ గత ఏడాది రథసప్తమి నాడు రూ.70,39,308 ఆదాయం రాగా ఈ సారి గత ఏడాది కంటే రూ.35,70,412 మేరకు అదనంగా ఆదాయం లభించిందన్నారు. భారీగా భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా పాసులను, దర్శన టిక్కెట్లను ఉదయం నుంచి నిలిపివేయడంతో ఆదాయం తగ్గిందని భావిస్తు న్నామన్నారు. క్షీరాభిషేకం టిక్కెట్లు (రూ.500) ద్వారా రూ.19,23,500, విశిష్ట దర్శనం టిక్కెట్లు (రూ.300) ద్వారా రూ.31,11,600, వీఐపీ టిక్కెట్లు (రూ.300) ద్వారా రూ.24,84,600, ప్రత్యేక దర్శనం (రూ.100) ద్వారా రూ.14,25, 180, కేశఖండన శాల టిక్కెట్లు (రూ.40) ద్వారా రూ. 48,280, ప్రసాదాల విక్రయాలలో లడ్డూ (రూ.15) ద్వారా రూ.7,43,700, పులిహోర (రూ.10) ద్వారా రూ.4,11,340 తదితర అంశాల ద్వారా మొత్తం ఆదాయం రూ.1,06,09,720 వరకు లభించిందన్నారు. ఉత్సవాలు విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు ఊహించని విధంగా రెండు లక్షలకు మించి రావడంతో ఒకింత ఇబ్బందులు తప్పలేదని అంగీకరించారు. ఆలయం లోపల దర్శనాలు క్యూలైన్ల విషయంలో పెద్దగా సమస్యలు తలెత్తలేదని వివరించారు. ఉత్సవ నిర్వహణలో తమకు అన్నివిధాలుగా సహకరించిన కాంట్రాక్టర్ ఉంగటి పాపారావుకు, వెల్డర్ రుప్ప దాలినాయుడు (కాళిదాస్)లకు ఆలయ ఈఓ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


