నిరంకుశ చట్టాలు రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీసీ రాంజీ, విద్యుత్ చట్టాల సవరణ, లేబర్ కోడ్స్, సీడ్ బిల్లు, మినీ అణు విద్యుత్ ప్లాంట్ల వల్ల కార్పొరేట్ కంపెనీలకు లాభాలు, ప్రజలపై భారాలు వేయడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తులసీదాసు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంకుశ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 30న గ్రామాల్లో ప్రతిజ్ఞలు, సంతకాల సేకరణ, ఫిబ్రవరి 2న సచివాలయాల్లో వినతి పత్రాలు అందజేత, 5న మండల కేంద్రాలు ధర్నాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కొత్త ఉపాధి చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలు అప్పులు పాలవుతాయని, సామాజిక న్యాయం దెబ్బతిని దళితులు, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. విద్యుత్ చట్టానికి సవరణలు చేయడం ద్వారా పేదలకు అందే క్రాస్ సబ్సిడీ రద్దవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1 నుంచి లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే, కార్మికులు కనీస హక్కులతోపాటు సమ్మె హక్కును కోల్పోతారని, 8 గంటల పని విధానం రద్దు అవుతుందన్నారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులన్నీ నిర్వీర్యమవుతాయని చెప్పారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ ఎన్నికల హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానమివ్వాలన్నారు. జిల్లాలో ఐ.టి.డి.ఎ. ఏర్పాటు, జీడికి గిట్టుబాటు ధర, జీడి బోర్డు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి తదితర హామీలు నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. జిల్లాలో బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కె.మోహనరావు, సీపీఎం నాయకులు పి.తేజేశ్వరరావు, కె.నాగమణి, ఎస్.లక్ష్మీనారాయణ, ఎన్.షణ్ముఖరావు, పోలాకి ప్రసాద్, సీహెచ్ అమ్మన్నాయుడు, శిర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


