కన్నుపడిందా.. గొలుసు గోవిందా!
పోలీసులకు పట్టుబడిన ఒడిశా చైన్‌స్నాచర్
నిందితుడి వద్ద 5 తులాల బంగారం
స్వాధీనం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో 2024 ఏడాది నుంచి ఎనిమిది చోట్ల గొలుసు దొంగతనాలు, ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన ఒడిశా నేరస్థుడు ఎట్టకేలకు ఎచ్చెర్ల పోలీసులకు పట్టుబడ్డాడు. శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తన కార్యాలయంలో సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా భంజూనగర్‌కు చెందిన రావుల వినోద్ చెడువ్యసనాలకు బానిసై మొదట్లో సెల్‌ఫోన్లు దొంగిలించేవాడు. తర్వాత అస్కా ప్రాంతానికి చెందిన మేకల గణేష్‌తో కలిసి ద్విచక్రవాహనాలు, బంగారు గొలుసులు కొట్టేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలోనే 2024 నుంచి మందస, రణస్థలంలో బైక్ చోరీలు, రణస్థలం, ఎచ్చెర్ల, నందిగాం, అనకాపల్లి జిల్లా కశింకోట పరిధిలో చైన్‌స్నాచింగ్ లకు పాల్పడ్డారు. గతేడాది జూన్ 16న ఎచ్చెర్ల గ్రామం రామ్‌నగర్ కళ్లాల వద్దకు పేడను పారబోసి తిరిగి ఇంటికి వస్తున్న నేతింటి సూరమ్మ అనే మహి ళ పుస్తెల తాడు తెంచుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ ఎం.అవతారం, అప్పటి ఎస్‌ఐ సందీప్‌లు దర్యాప్తు మొదలుపెట్టారు.
కడప గోల్డ్‌షాపులోనూ చోరీ..
ప్రస్తుత ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తన టీమ్‌తో కలిసి పాతనేరస్థుల కదలికలపై నిఘా పెట్టి ఫింగర్ ప్రింట్, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు.చిలకపాలెం వద్ద సోమవారం నిందితు డిని అరెస్టు చేశారు. సీఐ సమక్షంలో విచారించగా కడప బద్వేలులో శ్రీరామ్, పోతురాజు, మౌలాలీ అను స్నేహితులతో కలిసి రాత్రిపూట గోల్డ్‌షాపు మూసేస్తున్న సమయంలో యజమాని వద్ద నుంచి రెండు బ్యాగులు లాక్కొని పారిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇతర నేరాలు చేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడి నుంచి ఐదు తులా ల బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మరో స్కూటీని రికవరీ చేయాల్సి ఉందని, వినోద్‌కు సహకరించిన మేకల గణేష్‌ను అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ లక్ష్మణరావు, హెచ్‌సీ రమణయ్య, పీసీలు రవికుమార్, శంకర్, దివాకర్, హేమంత్‌కుమార్‌లను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
కన్నుపడిందా.. గొలుసు గోవిందా!


