బాధితులకు అండగా ఉండాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి అక్టోబరు నెలలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును సమీక్షించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, ఉద్యోగ నియామకాలను సత్వరమే పూర్తి చేసి వారికి భరోసా కల్పించాలన్నారు. 2017 నుంచి 2025 వరకు జిల్లాలో నమోదైన 12 హత్య కేసుల్లో బాధిత కుటుంబ సభ్యుల విద్యార్హతల ఆధారంగా 12 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో పలు కేసులు దర్యాప్తులో ఉన్నాయని, వాటిని వేగంగా పూర్తి చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.
కలెక్టర్ దృష్టికి సమస్యలు
సమావేశంలో పలువురు సభ్యులు క్షేత్రస్థాయి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రిమ్స్ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో రోస్టర్ పద్ధతి పాటించాలని, అక్కడ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు. సోంపేట మండలంలో ఎస్టీల భూ సమస్యలు, ఐటీడీఏ సీతంపేట బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, పాతపట్నం వసతి గృహాల్లో సౌకర్యాలపై ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా మందస, మెలియాపుట్టి మండలాల్లోని ఏకలవ్య పాఠశాల వసతి గృహాల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉపాధి కల్పించాలని, సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానెల్స్‌కు రాయితీ ఇవ్వాలని విన్నవించారు. సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, పలాస ఆర్డీవో వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, కమిటీ సభ్యులు గేదెల రమణమూర్తి, దాసరి తిరుమలరావు మాదిగ, దండాసి రాంబాబు, తోట రాములు, కళింగపట్నం అప్పన్న, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.


