ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని జ్యోతీరావు పూలే పార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ఎల్.బాబూరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. 2025 జూన్‌లో బదిలీ కోరుకున్న వందలాది ఉపాధ్యాయులు నేటికీ రిలీవింగ్‌కు నోచుకోలేదన్నారు. వారి స్థానంలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించి ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని, సింగిల్ టీచర్స్ స్కూల్ ఉపాధ్యాయులు సెలవులు వినియోగించుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులపై ఆ శాఖ అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, విద్యార్థుల మరణాలకు బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేస్తున్నారని, ఇంక్రిమెంట్లు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల రాత్రి బస రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ వందరోజుల ప్రణాళిక నుంచి ఆదివారం, రెండో శనివారం, పండగ దినాలను మినహాయించాలని, పరీక్ష మార్కుల అప్‌లోడ్ చేయాలనే ఒత్తిడిని తగ్గించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో జె.వి.వి.రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా సహాధ్యక్షుడు వై.ఉమాశంకర్, జిల్లా కోశాధికారి పి.సూర్యప్రకాశరావు, జిల్లా కార్యదర్శులు బి.శంకరరావు, హెచ్ అన్నాజీరావు, జి.సురేష్, జి.నారాయణరావు, టి.వి.టి.భాస్కరరావు, జి.శ్రీరామచంద్రమూర్తి, బి.గౌరీశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్.దమయంతి, రాష్ట్ర కౌన్సిలర్లు కె.దాలయ్య, బి.తవిటమ్మ, సీపీఎస్ జిల్లా కన్వీనర్ ఎన్.రవికుమార్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పి.ఉమాభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


