మూడొంతులు దళారీలవే..!
పోలాకి: మిల్లుల వద్ద రైతుల బదులు మధ్యవర్తులు.. కొనుగోలు వద్ద దళారులు.. మిల్లుల్లో లెక్కలకు రాని ధాన్యపు రాశులు.. వెరసి పోలాకి మండలంలోని ధాన్యం కొనుగోలు పూర్తిగా దళారుల వశమైంది. వారి చేతులమీదుగానే అన్ని వ్యవహారాలూ సాగుతున్నాయి. మిల్లులకు చేరిన ధాన్యంలో మూడొంతులు వారివేనంటే అతిశయోక్తి కాదు.
మండలంలో దాదాపు 8 వేల హెక్టార్లలో ఖరీఫ్ వరికి సంబంధించి 32 వేల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 14,532.68 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో మూడొంతులు దళారీలు, మధ్యవర్తులు తెచ్చి మిల్లర్లకు అప్పగించినవే. 80 కిలోల ధాన్యం బస్తా రూ.1,910లగా ప్రభుత్వ మద్దతు ధరకు కొనాల్సి ఉండగా.. రైతులకు రూ.1650 నుంచి రూ.1,700 వరకే అందుతోంది. మిగిలిన మొత్తం సొమ్ము హమాలీ, ట్రావెలింగ్ తదితర ఖర్చులు సాకుగా చూపి రైతుల నుంచి దళారీలు దోచుకుంటున్నారు. పైగా మిల్లుల్లో అదనంగా 2 కిలోలు ధాన్యం తప్పనిసరి అనే నిబంధన ఉంది. ఈ విషయం ఉన్నతస్థాయిలో తెలిసినా ఎవరూ ఏమీ చేయడం లేదు. కొన్నిచోట్ల భూమిహక్కు పత్రాలులేని, చిన్న, సన్నకారు, కౌలు రైతుల నుంచి బస్తాకు (80కిలోలు) 4 నుంచి 5 కిలోల ధాన్యం అదనంగా దోచుకుంటున్నారు. నేరుగా భూమి హక్కు పత్రా లు ఇస్తే బస్తాకు రూ.50 కమీషన్ ఇచ్చే ఏర్పాట్లు కూడా మధ్యవర్తులే చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సినిమా సెట్టింగులా..
ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు వ్యవస్థ సినీసెట్టింగ్‌ను తలపిస్తోంది. క్షేత్రస్థాయిలో సచివాలయాల వద్ద ఉన్న డేటాఎంట్రీ ఆపరేటర్, తరువాత టెక్నికల్ అసిస్టెంట్‌ను దాటి మిల్లుల వద్ద ఉన్న కస్టోడియన్ అధికార్లు (వీఆర్వోలు) వరకు దళారీలు మూడు స్టేజిల్లో దాటుకుంటూ వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పంట పొలం పక్కనే మిల్లు ఉన్నప్పటికీ సుదూరంలో ఉన్న సచివాలయం వద్దకు ధాన్యం తీసుకెళ్లి ట్రక్‌షీట్ వేసుకోవాలనే నిబంధనే దళారీలకు అనుకూలంగా మారింది. ఇన్ని పాట్లు పడలేమని రైతులు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. నేరుగా మధ్యవర్తుల నుంచి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాలంటే వివరాలు బి–రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉండగా ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు.
నిలువుదోపిడీ
ప్రతి సచివాలయంలోనూ రైతుల తరఫున ట్రక్‌షీట్ వేసే ది దళారీలే. మాలాంటి రైతు లు నేరుగా వెళ్తే టెక్నికల్ ఇష్యూ అని, యాప్ పని చేయటంలేదనిచెబుతున్నారు. ఇంత నిలుపు దోపి డీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు.
– యేదూరు శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల రైతు విభాగం అధ్యక్షుడు, పోలాకి
దళారీలకు అనుకూలంగా మార్చేశారు
ధాన్యం కొనుగోలును దళారీలకు, మధ్యవర్తులకు అనుకూలంగా మార్చేశారు. రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయన్న విషయం తప్ప.. క్షేత్రస్థాయిలో మొత్తం దళారీలతోనే వ్యవస్థ నడు స్తోంది. మిల్లర్లు నేరుగా అధికారులకు లంచాలు ఇస్తున్నామని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసేలా వ్యవస్థను దిగజార్చారు. – ధర్మాన కృష్ణచైతన్య,
జెడ్పీటీసీ సభ్యుడు, పోలాకి
రైతులను దోచుకుంటున్న దళారులు
మిల్లుకు చేర్చిన ధాన్యంలో
మూడొంతులు వారివే
ఖర్చుల పేరుతో అన్నదాత జేబుకు చిల్లు
పట్టించుకోని అధికారులు
మూడొంతులు దళారీలవే..!
మూడొంతులు దళారీలవే..!


