ప్రాణం తీసిన హైవే గొయ్యి
రణస్థలం: మండల కేంద్రంలో జరుగుతున్న జాతీ య రహదారి పై వంతెన పనులు అమాయక ప్రయాణికులను బలికొంటున్నా యి. ఎక్కడికక్కడ గోతులు తవ్వడం, హెచ్చరిక బోర్డులు సరిగ్గా కనిపించకపోవడంతో వాహనదారులు ఆ గోతుల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా పిల్లర్ గొయ్యిలో పడి ఓ మూగవాడు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు, జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు లావేరు మండలంలోని వేణుగోపాలపురం (అగ్రహారం) గ్రామానికి చెందిన దుర్గాసి నర్సింగరావు(25) శ్రీకాకుళం నుంచి రణస్థలం వైపు వస్తుండగా పైవంతెనకి తీసిన పిల్లర్ గోతిలో శనివారం రాత్రి 11 గంటలకు పడిపోయాడు. పైవంతెన పనుల నిమిత్తం హైవే రోడ్డు నుంచి సర్వీస్ రోడ్డుకి మలుపు ఉందని పెట్టిన బోర్డులు అతడు గమనించలేదు. అలాగే ఆ మలుపు వద్ద పూర్తి స్థాయిలో స్టాపర్ బోర్డులు లేవు. హైవేపై ఉన్న గ్యాప్ నుంచి ద్విచక్రవాహనంతో మలుపు తిరగకుండా నేరుగా వచ్చి గోతి లో పడిపోయాడు. ఆదివారం ఉదయం స్థానికు లు చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి తల్లిదండ్రులు సన్యాసమ్మ, లక్ష్మణరావు, అన్నయ్య రమేష్, అక్క పార్వతి ఉన్నారు. ఇతడు పుట్టుకతోనే మూగవాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ బతుకుతున్నాడు. మృతదేహాన్ని శవపంచనామా కోసం శ్రీకాకుళం సర్వజనాస్పత్రికి తరలించారు. జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ప్రాణం తీసిన హైవే గొయ్యి


