స్టాంప్ పేపర్ల కొరత!
● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొరకని
నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు
టెక్కలి: టెక్కలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత కొనుగోలు దారులను వేధిస్తోంది. గత కొన్ని నెలలుగా 10, 20 రూపాయల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలుదారులు బయట మార్కెట్‌లో కొంత మంది స్టాంప్ వెండర్ల ను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే కార్యాలయంలో స్టాంప్ పేపర్లు దొరక్కపోవడంతో, బయట ఒక్కో పేపర్ రూ.50 నుంచి రూ.100 ఆ పైన కొనుగోలుదారుల అవసరానికి తగ్గట్టుగా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ, కార్యాలయంలో స్టాంప్ పేపర్లు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు. నిత్యం వివిధ రకాల అఫిడవిట్లు, ప్రకటనలు, సాధారణ ఒప్పందాలకు, సెల్ఫ్ డిక్లరేషన్, అండర్ టేకింగ్, నోటరీ తదితర అవసరాలు కోసం అధికంగా డబ్బులు చెల్లించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీనిపై సబ్ రిజిస్ట్రార్ బాలన్న వద్ద ప్రస్తావించగా కొన్ని రకాల సాంకేతిక కారణాలతో 10, 20 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు రావడం లేదని వెల్లడించారు.


