ధనుర్మాసపు వేకువన.. దైవనామ సంకీర్తన
కొత్తూరు: ధనుర్మాసం సందర్భంగా ఏటా కొత్తూరులో నిర్వహించే హరేరామ నగర సంకీర్తనకు 45 ఏళ్లు పూర్తయ్యాయి. లోక కల్యాణార్ధం కొత్తూరుకు చెందిన వైశ్యరాజు శ్రీరామరాజు 1980లో తన ఇంటి నుంచి హరేరామ నగర సంకీర్తన ప్రారంభించారు. గ్రామంలో వేకువజామున హరేరామ నగ ర సంకీర్తన చేసుకుంటూ గ్రామంలోని సీతారామ మందిరం వద్దకు చేరుకొని ఆలయంలో కూడా భజన చేసేవారు. కొంతకాలానికి ఆయనతో మరికొందరు జత కలిశారు. ఇలా 45 ఏళ్లుగా ఊరిలో హరేరామ నగర సంకీర్తనను చేస్తున్నారు. ప్రస్తుతం నగర సంకీర్తనలో సుమారు 20 మంది పాల్గొంటున్నారు. తిత్లీ, హుద్‌హుద్ తుఫాన్‌లతో పాటు కరోనాలో కూడా నగర సంకీర్తన ఆపలేదు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంతకవిటికి చెందిన యాలాల శ్రీనివాసరావు ప్రవచనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉండడంతో పాటు లోకకల్యాణార్థం ఈ సంకీర్తనలు నిర్వహించనున్నట్లు నిర్వాహుకులు లోతుగెడ్డ భగవాన్‌దాసు నాయుడు, ఎల్.జగ్గునాయుడు, కె.ఆనందరావు, ఎ.ఆదినారాయణ, వైకుంఠరావులతో పాటు పలువురు సభ్యులు తెలిపారు.


