రిమ్స్‌లో క్యాంటీన్ కలేనా?
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల ఆవరణలో వైద్యులు ,వైద్య విద్యార్థులు, స్టాఫ్ నర్సులు, మినిస్ట్రీయల్ సిబ్బందికి ఇప్పట్లో క్యాంటీన్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి ఇక్కడ క్యాంటీన్ ఏర్పాటు కోసం అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయి ఏడాది దాటినా అధికారులు స్వాధీనం చేసుకోలేదు. క్యాంటీన్ నిర్వహణకు టెండర్‌ని కూడా పిలవలేదు. ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు క్యాంటీన్ కోసం నిర్మించిన భవనాన్ని రోగులకు భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు అప్పగించాలని ఆదేశించారు. ఇప్పుడు రోగుల కోసం వంటకాల సాగిస్తున్న గది అధ్వానంగా ఉందని అపరిశుభ్రంగా ఉందని పేర్కొన్నారు. అలాగే మార్చురీ సమీపంలో క్యాంటీన్ భవనాన్ని నిర్మించడం వల్ల అక్కడ తినేందుకు ఇబ్బంది పడతారని చెప్పారు. ఇదే సమావేశంలో ఆ భవనాన్ని కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు తీర్మానం చేసేశారు. కాంట్రాక్టర్‌కు అప్పగించిన భవనానికి మెట్లు తప్ప ర్యాంప్ లేదని, ఆహారాన్ని కిందకు దించడం కష్టమని కొందరు అధికారులు దృష్టికి తీసుకువచ్చిన ర్యాంపు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు. క్యాంటీన్ నిర్వహణకు వేరొక స్థలాన్ని ఎంపిక చేసుకొని నిర్మించుకోవాలని సూచించారు. ఇది జరగాలంటే సుమారు రెండేళ్లకు పైగా పట్టే పరిస్థితి ఉంటుంది. అప్పటివరకు రిమ్స్‌లో పనిచేస్తున్న 300 మంది వైద్యులు, వెయ్యి మందికి పైగా ఎంబీబీఎస్ విద్యార్థులు, 300 మంది పీజీ విద్యార్థులు, 200 మంది వరకు హౌస్ సర్జన్లు, 400 మంది స్టాఫ్ నర్సులు, మరో 500 మంది వరకు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది, నిత్యం అవుట్ పేషెంట్లుగా, ఇన్ పేషెంట్లుగా వైద్య సేవల కోసం వచ్చే వెయ్యి మందికి పైగా రోగులకు క్యాంటీన్ సేవలు అందుబాటులో లేనట్లే.
రేకుల షెడ్డే గతి..
ప్రస్తుతం రిమ్స్‌లో ఓ చిన్న రేకుల షెడ్డులో క్యాంటీన్ నిర్వహిస్తున్నారు.. ఇందులో ఫలహారాలు, ఆహారం అంతంతమాత్రంగానే లభిస్తున్నాయి. అపరిశుభ్ర వాతావరణం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. తమ కోసం ఏర్పాటు చేసిన మెస్‌లో ఆహార పదార్థాలు బాగా ఉండటం లేదని, క్యాంటీన్ సదుపాయం లేక అర్ధాకలితో ఉండాల్సి వస్తోందని పీజీ విద్యార్థులతో పాటు హౌస్ సర్జన్లు పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండాపోయింది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని రిమ్స్ భవనాల్లో ఏదో ఒకచోట క్యాంటీన్ నిర్వహించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
రోగులకు సరఫరా చేసే ఆహారం పరిశుభ్రంగా ఉండాలని క్యాంటీన్ భవనాన్ని కాంట్రాక్టర్‌కు అప్పగించాం. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి రిమ్స్‌లో ఖాళీగా ఉన్న ఏదో ఒక భవనంలో క్యాంటీన్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. ఈలోగా స్థలాన్ని గుర్తించి క్యాంటీన్ భవనం నిర్మించేలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపడతాం.
– ప్రసన్నకుమార్,
రిమ్స్ సూపరింటెండెంట్
రోగులకు భోజన సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు అప్పగించిన క్యాంటీన్ భవనం ఇదే
రోగుల భోజన ఏర్పాట్ల కోసం కొత్త భవనం
అప్పగింత
క్యాంటీన్ కోసం వేరొక స్థలం చూసుకోవాలని పాలకుల ఆదేశం
రిమ్స్‌లో క్యాంటీన్ కలేనా?


