ఉన్నట్టా.. లేనట్టా!
రిమ్స్‌లో పోస్టుల భర్తీ
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు విడుదలైన నోటిఫికేషన్ రద్దయ్యిందో.. కొనసాగుతుందో తెలియక అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు సైతం ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో అయోమయం చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రిమ్స్ అధికారులు 41 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేశారు. సుమారు 2500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సాధారణ అభ్యర్థులు ఒక్కొక్కరూ రూ.300 చొప్పున, ఎస్సీ, ఎస్టీలు రూ.100 చొప్పున ఫీజు చెల్లించారు. ఇలా దరఖాస్తుదారుల నుంచి సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు రిమ్స్ ఖాతాకు జమైంది.
మంత్రి ఆదేశాలతో బ్రేక్!
ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని అభ్యర్థులంతా ఎదురుచూస్తుండగా అక్టోబర్‌లో రిమ్స్ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఎందుకు జారీ చేశారన్నది తెలియకపోయినప్పటికీ, తన దృష్టికి తీసుకురాకుండా నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేశారని ఇదే సమావేశంలో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన నెల వరకు అధికారుల్లో కదలిక లేకపోవడంతో అభ్యర్థులతో పాటు మిగిలిన వారంతా నోటిఫికేషన్ రద్దయిందని భావించారు.
డీఎంఈ ఆగ్రహం..
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలకు మంజూరైన పోస్టులను ఆయా అధికారులు భర్తీ చేసినా శ్రీకాకుళంలో పెండింగ్‌లో ఉండిపోవడం పట్ల డీఎంఈ అధికారులు రిమ్స్ అధికారులపై మండిపడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రి ఆదేశాలను తెలియపరచగా.. అకారణంగా నోటిఫికేషన్ రద్దు చేయవద్దని, అభ్యర్థులు ఫీజు చెల్లించడం వల్ల వారంతా ఆందోళన చేసే అవకాశాలు ఉంటాయని తక్షణం మెరిట్ జాబితాను విడుదల చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఆదేశాలతోనే రిమ్స్ అధికారులు మెరిట్ జాబితాను విడుదల చేశారని సమాచారం. కారణం ఏదైనాప్పటికీ ఎటువంటి అవకతవకలు జరగకపోయినా నోటిఫికేషన్‌ను మంత్రి ఆదేశాల మేరకు రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణం ఈ పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నోటిఫికేషన్‌పై స్పష్టమైన ప్రకటనను విడుదల చేయాలని కోరుతున్నారు.
నోటిఫికేషన్ రద్దుకు మంత్రి
అచ్చెన్నాయుడు ఆదేశం
అయినా మెరిట్ జాబితా విడుదల చేసిన రిమ్స్ అధికారులు
సెలక్షన్ జాబితా విడుదల కాకపోవడంతో అభ్యర్థుల అయోమయం
అనూహ్యంగా మెరిట్ ప్రకటన..
ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితా నోటీస్ బోర్డులో ఉంచామని, ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా అభ్యర్థులు తెలియజేయాలని గత నెలలో రిమ్స్ అధికారులు అనూహ్యంగా ప్రకటన విడుదల చేశారు. దీంతో మెరిట్ ఉన్న అభ్యర్థులు తమకు ఉద్యోగాలు వచ్చేసినట్లేనని సంతోషపడ్డారు. అయితే మెరిట్ జాబితా విడుదలై నెల రోజులకు పైబడుతున్న సెలక్షన్ జాబితా ప్రకటించకపోవడంతో ఇటీవల కొందరు అభ్యర్థులు గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌ను కలిసి సమస్య వివరించారు. అయితే, నోటిఫికేషన్ రద్దయిందని దీనికోసం మరల కలవక్కర్లేదని కలెక్టర్ చెప్పడంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నోటిఫికేషన్ రద్దుకు గల కారణాలు కూడా తెలియరావడం లేదు. కేవలం మంత్రి ఆదేశాల మేరకే నోటిఫికేషన్ రద్దు చేశారని రిమ్స్‌లోని కొందరు ఉద్యోగులు చెబుతున్నప్పటికీ ఆదేశాల అనంతరం మెరిట్ జాబితాను ఎందుకు విడుదల చేశారు అన్నదానికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.
నిర్ణయం వారిదే..
ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మెరిట్ జాబితాను కమిటీకి సమర్పించాం. నోటిఫికేషన్ రద్దు చేస్తారా? భర్తీ చేస్తారా? అన్నది మా పరిధిలో లేని విషయం. – డాక్టర్ అప్పలనాయుడు,
ప్రిన్సిపాల్, రిమ్స్ వైద్య కళాశాల


