సృజనాత్మక బోధనతో ఉత్తమ ఫలితాలు
శ్రీకాకుళం రూరల్: బోధనలో సృజనాత్మకతను జోడిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని గురుకుల విద్యాసంస్థల సమన్వయాధికారి వై.యశోదలక్ష్మి అన్నారు. పెదపాడులోని అంబేడ్కర్ గురుకులంలో భాషా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు గురువారం ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు శతశాతం ఫలితాలు సాధించేలా అధ్యాపకులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అనంతరం స్టేట్ రిసోర్స్ పర్సన్ ఐ.సంతోష్‌కుమార్ హిందీ ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ కె.తారకరామారావు, గురుకుల కళాశాలల ప్రిన్సిపాల్స్ ఎస్.పద్మజ, ఎన్.రామకృష్ణ, బుచ్చిబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సందేశాత్మక ‘యూనివర్సిటీ’
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విద్య, వైద్య రంగాలు నడవాల్సి ఉన్నా అవేమీ కానరావడం లేదని, తల్లిదండ్రుల నుంచి లక్షలు సొమ్ము దోచేస్తుండటంతో వారంతా అప్పులపావుతున్నారని జిల్లా బార్ అసోషియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇదే ఇతివృత్తంతో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి సందేశాత్మకంగా ‘యూనివర్శిటీ’ చిత్రం తీసి ప్రభుత్వాల తీరుని ఎండగట్టేలా చేశారని చెప్పారు. దర్శక నటుడు ఆర్.నారాయణమూర్తి గురువారం శ్రీకాకుళంలోని ఎస్.వి.సి. థియేటర్‌లో చిత్రం విడుదల సందర్భంగా రావడంతో ఆయన్ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. సినిమా వృత్తాంతం నేటి సమాజానికి అద్దంపడుతోందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివ ప్రసాదరావు, వాన కృష్ణచంద్, గేదెల వాసుదేవరావు, ఎన్ని సూర్యారావు, న్యాయవాదులు, మామిడి క్రాంతి, ఆగూరు ఉమామహేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి, రెడ్డి విశ్వేశ్వరరావు, కడగల రాంబాబు, బొత్స సుదర్శనరావు, వాన ప్రమోద్, రచయిత అట్టాడ అప్పలనాయుడు, సాహిత్యాభిలాషి దాసరి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ
రణస్థలం: విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు పైడిభీమవరంలోని సీఐటీయూ కార్యాలయంలో అఖిల భారత మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్లకు మేలు చేసేందుకు, కార్మిక వర్గం హక్కులను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో సీఐటీయూ అగ్రభాగాన నిలిచిందన్నారు. దేశంలో వివిధ రంగాల కార్మికులను, సంఘాలను ఐక్యం చేసి బలమైన కార్మిక వర్గ పోరాటాలను నిర్మించేందుకు ఆర్.కె. బీచ్‌లో జరిగే మహాసభలు దోహదపడతాయన్నారు. సమావేశంలో కార్మికులు, అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్స్ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెలమల రమణ, వెంపడాపు లక్ష్మణరావు, ఎమ్. నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
సృజనాత్మక బోధనతో ఉత్తమ ఫలితాలు
సృజనాత్మక బోధనతో ఉత్తమ ఫలితాలు


