వరి కుప్పలు దగ్ధం
ఆమదాలవలస: మున్సిపాలిటీ పరిధిలోని కాళింగ మన్నయ్యపేటలో సువ్వారి స్వామినాయుడు, కూన మోహనరావులకు చెందిన వరి కుప్పలకు బుధవారం అర్ధ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే 90 సెంట్లకు సంబంధించిన వరి కుప్పలు మొత్తం కాలిబూడిదయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా కాలిపోవడంతో బాధిత రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ టి.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన వరికుప్పలను పరిశీలించారు. అగ్నిమాపక అధికారి బొడ్డేపల్లి హరినారాయణ, వీఆర్వో ఇంద్ర పాల్గొన్నారు.
గత ఏడాది కూడా..
ఇదే గ్రామంలో గురుగుబెల్లి రాజశేఖర్ అనే రైతుకు చెందిన వరి కుప్పలను గత ఏడాది దగ్ధం చేశారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈ ఏడాది కూడా అదే మాదిరిగా వరికుప్పలను దగ్ధం చేశారని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో చొక్కాకుల బంధ ఆక్రమణలు తొలగించడం వల్లే ఈ విధంగా వరికుప్పలను దగ్ధం చేస్తున్నారని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


