లక్షన్నర మంది చిన్నారులకు పల్స్‌పోలియో
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఐదేళ్లలోపున్న 1,55,876 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. మూడు రోజుల్లో దాదాపు 6,18,024 ఇళ్లను సందర్శించి 1.55 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నామని వివరించారు. మొదటి రోజు పోలియో బూత్‌లు, తర్వాత రెండు రోజులు ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,252 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, సంతల వద్ద ప్రయాణంలో ఉన్న పిల్లల కోసం 40 ట్రాన్సిట్ బూత్‌లు పనిచేస్తాయని వివరించారు. వీటికి అదనంగా, వీధులు, పొలాల్లోకి వెళ్లేందుకు 84 మొబైల్ బృందాలను నియమించినట్లు తెలిపారు. వలసలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు వంటి 101 హై రిస్క్ ఏరియాలను గుర్తించామన్నారు. మొత్తం 7,430 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండు రోజుల ముందు నుంచే మైకింగ్, డప్పు చాటింపు, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని డీఎంహెచ్‌ఓ అనితను కలెక్టర్ ఆదేశించారు.


