21న ఘంటసాల ఆరాధనోత్సవం
శ్రీకాకుళం కల్చరల్:
జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం సమీపంలో అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ నెల 21న ఘంటసాల శతజయంతి వేడుకలను పురస్కరించుకొని 12 గంటల పాటు నిర్విరామ ఆరాధనోత్సవం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కోశాధికారి సుబ్బారావు తెలిపారు. పీఎన్ కాలనీలోని వరసిద్ధి వినాయక పంచాయతన ఆలయంలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్, జీబీఏ స్వరమాధురి సంయుక్త నిర్వహణలో జరిగే ఘంటసాల ఆరాధనోత్సవంపై బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994 నుంచి సంస్థ ప్రతినిధులు ముద్దాలి రఘురామ్, సభ్యుల సహకారంతో వివిధ జిల్లాల్లో 12 గంటలు, 24 గంటలు, 36 గంటలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఎంతోమంది బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, లీల వంటి ప్రముఖ గాయకులను సత్కరించామన్నారు. ఇక్కడ కూడా ప్రముఖ గాయకుడు కారుణ్యను సత్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. అధ్యక్షుడు పి.జగన్మోహనరావు మాట్లాడుతూ ఎంపిక చేసిన 118 గీతాలతో 60 మంది గాయకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నిర్విరామంగా ఆలపిస్తారని, స్థానిక కళాకారులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కన్వీనర్ ఎం.వి.కామేశ్వరరావు, నిక్కు అప్పన్న, జంధ్యాల శరత్‌బాబు పాల్గొన్నారు.


