మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి
వజ్రపుకొత్తూరు రూరల్: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే శాంతి చర్చలను జరపాలని, అలాగే బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలని సీపీఐ(ఎంఎల్)న్యూడెమొక్రసీ జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. మండలంలో గల మర్రిపాడులో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద శనివారం అమరవీరుల స్మారక సభ కార్యక్రమం నిర్వహించారు. న్యూడెమొక్రసీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపరేషన్ కగార్ పేరుతో జనవరి నుంచి కేవలం 11 నెలల కాలంలోనే 800 మందిని ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చి చంపారని విమర్శించారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యూ డెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, పౌర హక్కుల సంఘ జిల్లా అధ్యక్షుడు పత్రి దానేష్, అమరవీరుల బంధు మిత్రుల కమిటీ నాయకులు జోగి కోదండరావు, ప్రజా కళా మండలి నాయకులు కొర్రాయి నీలకంఠం, లిబరేషన్ నాయకులు వంకల అప్పయ్య, ప్రజా సంఘ నాయకులు గొరకల బాలకృష్ణ, వీరస్వామి, పి.కుసుమ, బి.ఈశ్వరమ్మ, కృష్ణవేణి, సొర్ర రామారావు తదితరులు ఉన్నారు.


