కేసుల దర్యాప్తు ముమ్మరం చేయాలి
శ్రీకాకుళం క్రైమ్ : అపరిష్కృతంగా ఉన్న కేసుల దర్యాప్తు ముమ్మరం చేసి ముద్దాయిలను అరెస్టు చేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నెలవారీ నేరసమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. కొత్త చట్టాల అమలు, చార్జిషీట్ దాఖలు, నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు, బెయిల్ కౌంటరు దాఖలు, లోక్ అదాల త్ కేసులపై ఆరా తీశారు. కేసుల దర్యాప్తులో వైద్యు లు, ఫోరెన్సిక్ నిపుణులు, నివేదికలు తెప్పించుకోవాలని, ప్రాపర్టీ నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్థులు, జైలు నుంచి విడుదలైన నేరస్థులు, అంతర్రాష్ట్ర గ్యాంగులు, వ్యక్తులపై నిఘా పెంచాలన్నారు. నేర ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక గస్తీ, పెట్రోలింగ్ పెంచాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలన్నారు. సైబర్ కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న నగదును చట్టాన్ని అనుసరించి అందేలా చూడాలని, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, మద్యం, నాటుసారా, గంజాయి అక్రమ రవాణాలను అడ్డుకోవాలన్నారు. అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


