
తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలోని దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదల పెన్షన్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఇప్పటికే కొంతమంది పింఛన్లు తొలగించారని, మరికొందరికి నోటీసులు అందజేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు ఈ మేర కు వినతి పత్రం అందజేశారు. ఆయనతో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ, పార్టీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్టీ జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు వెలమల బాలరాజు, పార్టీ జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు రౌతు శంకరరావు, కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకటరమణ, ఎంపీపీ రోణంకి ఉమ మల్లయ్య, మండల సంపతి రావు హేమ సుందర రాజు, వైస్ ఎంపీపీ దుక్క రామకృష్ణ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నాలుగు వేల మంది దివ్యాంగులకు పింఛన్లు దూ రం చేశారని తెలిపారు. 50 ఏళ్లకే పింఛన్ హామీని సైతం మర్చిపోయారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదన్నారు. రీ వెరిఫికేషన్, రీ అసెస్‌మెంట్ పేరుతో దివ్యాంగులను కష్టపెట్టడం మానవత్వం కాదని, వారిని ఆదుకోవాలని కోరారు. పింఛన్ల భారం తగ్గించుకోవడానికే ప్రభుత్వం ఇన్ని కుట్రలు పన్నుతోందని తెలిపారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలన్నారు. పదేళ్లుగా పింఛన్ పొందుతున్న వారి ఆధారాన్ని దూరం చేయడం దారణ మన్నారు. దివ్యాంగులకు ఇలా అపకారం చేయ డం వల్ల మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పేరాడ తిలక్ అన్నారు. రాజకీయాలు, పింఛన్లు వేర్వేరు విషయాలని, అలా ఆలోచించగలిగేది వైఎస్ జగన్ మాత్రమేనని తెలిపారు.
దివ్యాంగులను ఆదుకోవడం మానవత్వం
వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్