
టోల్‌ప్లాజాల్లో అడ్డగోలు నియామకాలు
● ఎక్స్‌సర్వీసు కోటాకు తిలోదకాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: టోల్‌ప్లాజాల్లో అడ్డగోలు నియామకాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం నిబంధనలు గాలికి వదిలేసి నియామకాలు చేస్తున్న వైనం విస్మయపరుస్తోంది. ఎక్స్‌సర్వీసు కోటాను కూడా తుంగలో తొక్కుతున్నారు. జిల్లాకు సంబంధించి 16వ నంబర్ జాతీయ రహదారిపై రెండు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. మడపాం టోల్‌ప్లాజాలో దాదాపు 109 మంది పనిచేస్తున్నారు. నిబంధనల మేరకు ఇక్కడ 33 శాతం మంది రిటైర్డ్ ఆర్మీ, నేవీ ఉద్యో గులు ఉండాలి. కానీ ప్రస్తుతం 20 శాతం మందే ఉన్నారు. వీరికి డైరెక్ట్ జనరల్ ఆఫ్ రీ సెటిల్‌మెంటు ప్రకారం జీతాలు చెల్లించాలి. కానీ ఆ విధా నం కూడా అమలు కావడం లేదు. వీరిలో ఇటీవల పది మంది వరకు రిటైరయ్యారు. వీరి స్థానంలో ఎక్స్ సర్వీసు కోటాను ఉపయోగించి వేరేవారిని నియమించాలి. కానీ అలా చేయకపోవడంతో అర్హులు నష్టపోతున్నారు. రోస్టర్‌ను పక్కన పెట్టి నాయకులు నచ్చిన విధంగా నియామకాలు చేస్తున్నారు.
ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే నియమిస్తున్నారని, రోస్టర్ పాటించడం లేదని అక్కడి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాజాల్లో తల్లి–కొడుకు, తండ్రి–కొడుకు, ఇలా ఒకే కుటుంబం నుంచి ఒకే సామాజికవర్గం నుంచి ఉద్యోగాలు పొందడం వెనుక అధికార పార్టీ, సామాజిక వర్గం ప్రాధాన్యతలు పనిచేస్తున్నాయని అంటున్నారు.
గతంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య లేదని, పూ ర్తిగా నిబంధనలు పాటించేవారని, ఇప్పుడు మాత్రం రాజకీయ సామాజిక పలుబడి ఉన్నవారే టోల్ ప్లాజా ఉద్యోగులుగా చేరుతున్నారని, వాస్తవిక అర్హతలు ఉన్న వారు నష్టపోతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. పార్టీలు, నాయకులు మా రడం సహజమేనని, అయితే ఈ విధానం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైవే అథారిటీస్ ఈ నియామకాలు, టోల్ ప్లాజాల్లో జరుగుతున్న అవినీతి, పెరుగుతున్న సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.