
పొగురు తెచ్చిన చేటు..!
ఇచ్ఛాపురం రూరల్: అల్పపీడనం ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు బూర్జపాడు పంట పొలాలు నీట మునిగిపోయాయి. స్థానిక డొంకూరు ఉప్పుటేరుకు ఆనుకొని ఉన్న పంట పొలాల రైతులకు పొగురు వలన తీవ్ర నష్టం కలిగింది. కురిసిన వర్షాలకు వరద నీరు ఉప్పుటేరు గుండా సముద్రంలో కలవాల్సి ఉండగా.. సముద్రంలో ఉప్పుటేరు కలిసే చోట ఇసుక మేట వేయడంతో వరద నీరు పంట పొలాల్లోకి చొచ్చుకుపోయింది. దీంతో సుమారు 50 ఎకరాల వరకు పంట నీట మునిగిపోయింది. సోమ, మంగళవారం రోజున నాటిన వరినాట్లు వరద ఉద్ధృతికి నీటిపైకి తేలిపోవడంతో రైతులు తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం వరినారు ఎక్కడా దొరకని పరిస్థితి ఉండగా.. ఇటువంటి పరిస్థితుల్లో మరల నాట్లు ఎలా వేసేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డొంకూరు సముద్రం – ఉప్పుటేరు మధ్య ఇసుక మేటలు(పొగురు) తొలగిస్తే పంటలను రక్షించుకోవచ్చని, లేకుంటే వందల ఎకరాలకు నష్టం వాటిళ్లుతుందని వాపోతున్నారు.
ముంచెత్తిన వరద
నీటిలోనే పంట పొలాలు