
భద్రతకు భరోసా ఏదీ?
● చారిత్రక పద్మనాభుని కొండపై పాడైన సీసీ కెమెరాలు ● నిర్వహణ లేక మూలకు చేరిన పరికరాలు ● పట్టించుకోని దేవదాయ, పోలీస్ శాఖలు
జలుమూరు:
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం క్షేత్రపాలకుడు విష్ణుమూర్తి కరకవలస గ్రామ సమీపాన అనంత పద్మనాభ కొండపై కృష్ణార్జానులుగా కొలువుదీరి పూజలందుకుంటున్నారు. వీటితో పాటు గణపతి, లక్ష్మీదేవి, మహిషాసురమర్దిని తదితర దేవతా విగ్రహాలు కరనకవలస, అనుపురం, పరిసర గ్రామాల ప్రజలు నిత్యం పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తుంటారు. ఏటా ధనుర్మాసంలో జిల్లా నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కనుమ పర్వదినాన కొండపై స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి పెద్ద జాతర నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో రాష్ట్రం నలుమూలలు నుంచి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిసేవలో తరిస్తారు. ఆదాయం కూడా అధికంగానే ఉంటుంది. ఈ స్వామివారికి నిత్యం ఒక సర్పం రక్షిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇంతటి ప్రాశస్త్యమైన ఈ ఆలయానికి రక్షణ కరువైంది. గతంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలు ధ్వంసం చేసి హుండీ కూడా ఎత్తుకెళ్లారు. అప్పటి ఎస్పీ అమిత్ బర్దార్ పరిశీలించి రక్షణకు సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. దేవదాయ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిపై శ్రీముఖలింగంలోని దేవదాయ శాఖ కార్యాలయం అధికారులు, జలుమూరు పోలీసులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పట్టించుకోని అధికారులు..
విగ్రహాల ధ్వంసం సమయంలో హడావుడి చేసిన అధికారులు తర్వాత పూర్తిగా విస్మరించారు. సీసీ కెమెరాలు, సెటాప్ బాక్స్, విజన్స్, మోనిటర్ తదితర పరికరాల్లో కొన్ని చోరీకి గురి కాగా, మరికొన్ని నిర్వహణ లోపంతో పాడైపోయాయి. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇటీవల కాలంలో చోరీలు ఎక్కువయ్యాయని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంతో పాటు నిఘా పెంచాలని భక్తులు కోరుతున్నారు.

భద్రతకు భరోసా ఏదీ?