
యథేచ్ఛగా భూఆక్రమణ!
పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో భూ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు భూములనే తేడా లేకుండా కబ్జాల పర్వం కొనసాగుతోంది. తాజాగా కాశీబుగ్గలో కోట్ని విజయ్‌కు చెందిన జిరాయితీ ఖాళీ స్థలంపై ఆక్రమణదారుడి కన్నుపడింది. కాశీబుగ్గ కె.టి.రోడ్డుకు ఆనుకొని ఉన్న రూ.కోట్ల విలువైన ఈ స్థలాన్ని తెలుగు దేశం పార్టీ నాయకుల అండదండలతో తాళాసు నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితుడు కోట్ని విజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాత మూత్తాల నుంచి సంక్రమించిన జిరాయితీ భూమిలో నీలాపురం గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టరు ప్రొక్లెయినర్ తెచ్చి పునాదులు తవ్విస్తున్నాడని, దీనిపై ప్రశ్నిస్తే భవనం నిర్మాణం చేయడానికి కాంట్రాక్టు ఇచ్చారని, అందుకే పునాదులు తీస్తున్నానంటు బెదిరిస్తున్నారని లబోదిబోమంటున్నాడు. స్థలం వ్యవహారం కోర్టులో ఉందని, తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని తెలిసి దౌర్జన్యంతో అక్రమంగా నిర్మాణాలు చేయడానికి పూనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు కూడా లేవని, అయినా అధికార పార్టీ అండతో ఈ విధంగా తనకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విజయ్ వాపోయాడు. పోలీసు స్టేషన్‌లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు బెదిరించాడని, తన భూమిని కాపాడాలని పోలీసులను, మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నాడు.