
సహాయక చర్యలు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్ష నష్టాల అంచనా వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమల నివారణకు గంబూషియా చేపలు వదలాలని, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి క్లోరిన్ టాబ్లెట్లు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయాన్ని ఈ నెల 23లోగా శుభ్రం చేసుకోవాలని స్పష్టం చేశారు. పి–4 పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలిచిందని తెలిపారు. 64,166 బంగారు కుటుంబాలకు గాను 61,552 కుటుంబాలను దత్తత తీసుకున్నామని, 1,55,804 లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో కూడా జిల్లా మంచి పురోగతి సాధించిందని కలెక్టర్ చెప్పారు. 65,569 ఫిర్యాదులకు గాను 64,074 పరిష్కరించామని, 1,365 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజాభిప్రాయ సర్వేలో విద్యుత్, ఇసుక స్టాక్ పాయింట్, ఎకై ్సజ్ శాఖలపై సానుకూల స్పందన వచ్చిందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు బి.పద్మావతి, జయదేవి, ఇతర శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.