
అభ్యంతరాల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ–డివిజనల్ మేనేజర్ పోస్టు రాత పరీక్ష ఆగస్టు 10న నిర్వహించగా.. ఫలితాలు, ప్రొవిజనల్ జాబితా జిల్లా వెబ్‌సైట్ srikakulam.a p.gov.inలో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలను ఈ నెల 22లోగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. మార్కులపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా నిర్దేశిత తేదీ సాయంత్రం 5 గంటల లోగా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారికి నేరుగా తెలియజేయవచ్చని తెలిపారు.
రాధాసాగరంలో వ్యక్తి గల్లంతు
మెళియాపుట్టి: మండలంలోని గోకర్ణపురం పంచాయతీ చినహంస గ్రామానికి చెందిన లండ రామారావు(49) ఒడిశా రాష్ట్రంలోని రాధాసాగరంలో గల్లంతయ్యాడు. రామారావు సోమవారం సాయంత్రం ముగ్గురు స్నేహితులతో కలిసి చేపలు పట్టడానికి వినియోగించే ఓ చిన్న నాటు పడవలో సాగరంలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో నలుగురు నీటిలో పడిపోయారు. మిగిలిన ముగ్గురూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా రామారావు గల్లంతయ్యాడు. అయితే ఈ విషయాన్ని గ్రామంలో ఎవరికీ చెప్పలేదు. మంగళవారం ఉదయం విషయం తెలియడంతో గ్రామస్తులు అందించిన సమాచారంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టారు. చీకటిపడేవరకు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గాలింపు నిలిపి వేశారు. ఒడిశా పరిధి కావడంతో గారబంద పోలీసులు కేసు నమోదు చేశారు. లండ రామారావుకు భార్య లక్ష్మీ ఒక కుమారుడు ఉన్నారు.

అభ్యంతరాల స్వీకరణ