
దళితుల ఐక్యతపై కుట్ర
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):
ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల ఐక్యతపై ప్రధాని మోదీ, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు రాజకీయ కుట్ర పన్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.రత్నాకర్ అన్నారు. కులగణన జరగకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రయివేటు హోటల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాల సామాజికవర్గంపై చంద్రబాబు పగతీర్చుకుంటున్నారని, మాలలకు అన్యాయం జరుగుతున్నా ఈనాటికీ స్పందించలేదన్నారు. ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తుంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం అన్యాయమన్నారు. రిజర్వేషన్లతో లబ్ధి పొందిన మాల ఉద్యోగులు ఇప్పటికైనా కళ్లు తెరిచి తమ పోరాటానికి మద్దతిస్తే మన రిజర్వేషన్లు కాపాడుకోగలుగుతామన్నారు. శాంతియుత పోరాటానికి మనమంతా సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు అలికాన మహేష్‌కుమార్, యామల కృష్ణ, బొచ్చా శశిభూషణ్‌రావు, కాకర రవితేజ, కూసి కొండబాబు, నెల్లి సూరిబాబు, నూకరాజు, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.