
రోడ్డెక్కితే.. చలానా వాతే..!
ఖజానా నింపేందుకే..
వజ్రపుకొత్తూరు: రోడ్డెక్కుతున్న వాహన చోదకులను దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం మాస్టర్ స్కెచ్ వేసింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల పేరుతో రూ.కోట్లను ఖజానాలో వేసుకుంటోంది. వాస్తవానికి ఈ కార్డులు సక్రమంగా జారీ అవ్వడం లేదు. దీంతో వాహనదారులు డిజిటల్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగానే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాహనదారులకు కార్డుల భారం లేకుండా డిజిటల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఫిజికల్‌గా కార్డు లేకపోయినా.. డిజిటల్ కార్డులతో ఎటువంటి ఇబ్బందీ లేకపోయేది. అయితే టెక్నాలజీకి తానే ఆధ్యుడునని చెప్పుకునే సీఎం చంద్రబాబు తిరిగి ఫిజికల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
కార్డుల కోసం డబ్బులు చెల్లించినా...
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల విషయంలో వాహనదారుల పరిస్థితి సంకటంగా మారింది. కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినా జారీ చేయని పరిస్థితి ఉంది. రవాణా శాఖలో సేవలను సులభతరం చేశామని, కార్యాలయానికి రాకుండానే అన్ని సేవలు పొందవచ్చునని చెబుతున్న కూటమి ప్రభుత్వం, లైసెన్స్, ఆర్సీ కార్డుల కోసం రవాణా కార్యాలయాలు చుట్టూ తిప్పుకుంటోంది. వాహనం రోడ్డెక్కితే చాలు లైసెన్సు, ఆర్సీలు చూపించమని అటు రవాణా శాఖ, ఇటు పోలీసు అధికారులు దబాయిస్తున్నారు. కార్డుల కోసం డబ్బులు చెల్లించామని, కార్డులు ఇంకా ఇవ్వలేదని చెప్పినా చలానా రాసి చేతిలో పెడుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. కొంతమంది డిజీ వ్యాలెట్ యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న కార్డును చూపిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫిజికల్ కార్డు ఉంటే చూపించు వదిలేస్తామని స్పష్టం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో...
జిల్లాలోని పెద్దపాడు ప్రాంతంలో ప్రధాన రవాణా శాఖ కార్యాలయంతో పాటు శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురంలలో రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ జిల్లావ్యాప్తంగా సగటున 350కు పైగా వాహన రిజిస్ట్రేషన్లు, పర్మినెంట్ లైసెన్సులు జారీ చేస్తుంటారు. ఫిజికల్ కార్డుల కోసం ప్రభుత్వం అదనంగా ప్రతీ కార్డుకు రూ.235 వసూలు చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాహనదారులపై కార్డుల భారం తొలగించి డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ కార్డులను సెల్‌ఫోన్ వ్యాలెట్ యాప్‌లో అందుబాటులో ఉంచింది. పోలీసు, రవాణా అధికారులు అడిగినపుడు సేవ్ చేసుకున్న కార్డు చూపిస్తే సరిపోతుంది. పొరపాటును కార్డును మరిచిపోతే వాహన చోదకులపై చలానాలు రాసే పరిస్థితి ఉండకుండా డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు విజయవాడలో ముద్రించి రావాల్సి ఉంది. 2024 నవంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. కార్డుకు రూ.235 వసూలు చేస్తున్నాం. సగటున రోజుకు జిల్లావ్యాప్తంగా 250 వరకు కార్డులు నమోదు అవుతున్నాయి. కార్డులు వచ్చిన వెంటనే వారి చిరునామాలకు పంపిస్తాం. కార్డుల కోసం రవాణా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
– విజయసారధి, డీటీసీ, శ్రీకాకుళం
సంపద సృష్టిస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు ఇలా వాహన చోదకులను దోచుకోవడం ద్వారా ఖజానా నింపేందుకు స్కెచ్ వేశారు. టెక్నాలజీకి తానే ఆధ్యుడునని గొప్పలు చెప్పుకునే ఆయన గత ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ విధానానికి స్వస్థి పలికి వాహనదారులను దోచుకుంటున్నారు. గతేడాది నవంబర్ నుంచి కార్డుల జారీ కోసం ప్రత్యేక డబ్బులు తీసుకోవడం ప్రారంభించారు. లైసెన్సు జారీ, రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వ చలానాతో పాటు కార్డుకు ప్రత్యేకంగా రూ.235 ప్రత్యేకంగా చెల్లిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి డబ్బులు చెల్లించిన వాహనదారులకు ఇంతవరకు కార్డులు అందలేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు లక్షకుపైగా లైసెన్సు, ఆర్సీ కార్డులు రావాల్సిందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు డైవింగ్ లైసెన్సు, ఆర్సీ కార్డుల కోసం రూ.1.766 కోట్లుకు పైగా డబ్బులు చెల్లించడం గమనార్హం.
జిల్లాలో లక్షకు పైగా డెలివరీ కాని ఆర్సీ, లైసెన్స్ కార్డులు
డిజిటల్‌గా చూపించినా కేసులు నమోదు
లబోదిబోమంటున్న వాహన చోదకులు