
మరో 17 బార్‌ల ఏర్పాటుకు సన్నాహాలు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో 17 బార్‌లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశానుసారం తమ విభాగం కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టిందని శ్రీకాకుళం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీ) దోసకాయల శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని మెడికవర్ ఆస్పత్రి సమీపంలో ఉన్న కార్యాలయంలో డీసీ విలేకరులతో మాట్లాడారు. మూడేళ్ల కాలపరిమితికి లోబడి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైందని, శ్రీకాకుళం కార్పోరేషన్ (11), పలాస మున్సిపాలిటీ (2)ల పరిధిలోని 13 బార్లకు ఏడాది రీటైల్ ఎకై ్సజ్ ట్యాక్స్ (లైసెన్సు) ఫీజుగా రూ. 55 లక్షలుగా నిర్ణయించామన్నారు. ఆమదాలవలస(02), ఇచ్ఛాపురం(02) మున్సిపాలిటీలకు రూ. 35 లక్షలు లైసెన్సు ఫీజు అని ఆరుదఫాలుగా ఫీజును చెల్లించవచ్చన్నారు. దరఖాస్తులు నేటినుంచి ఆన్‌లైన్, హైబ్రిడ్, ఆఫ్‌లైన్‌లో స్వీకరిస్తామని, ఈ నెల 26 సాయంత్రం 5 గంటల వరకు చివరి గడువు అన్నారు. దరఖాస్తు రుసుం రూ. 5 లక్షలని, ప్రాసెసింగ్ ఫీజు మరో రూ.10 లక్షలని, డీడీ చలానాల ద్వారా చెల్లించేవారు, సంబంధిత కార్యాలయానికి వచ్చేవారు డీపీఈఓ ఆఫీస్ పేరిట చలానా కట్టాలన్నారు. ఒక్కో బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలని, లేదంటే తదుపరి నోటిఫికేషన్ వరకు వేచి ఉండాల్సిందేనన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని, ఎన్ని బార్లకై నా పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలోని శ్రీకాకుళం, పలాస పరిధిలో ఉన్న లైసెన్సుదారుల మద్యం దుకాణాలకు వచ్చే అక్టోబరు నుంచి రూ. 79 లక్షల లైసెన్సు ఫీజుగా ఉంటుందని, ఇచ్ఛాపురం, ఆమదావలస మున్సిపాలిటీల పరిధి దుకాణాలకు రూ. 65.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించిందని, వాటితో పోల్చుకుంటే బార్లకు తక్కువ ఫీజేనన్నారు. ఈ నెల 28న జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటరియంలో లాటరీ పద్ధతిన బార్లు కేటాయిస్తామన్నారు.
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ముగింపు ఈనెల 26న, లాటరీ 28న
ఎకై ్సజ్ కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏర్పాటు
వివరాలు వెల్లడించిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్‌రెడ్డి
కొత్త బార్ల పాలసీ మొదలయ్యాక ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 వరకు అమ్మకాలకు అనుమతినిస్తున్నట్లు చెప్పారు. బార్లకు అనుసంధానంగా రెస్టారెంట్లను పెట్టుకునేందుకు 15రోజులు అదనంగా లైసెన్సుదారులకు గడువిస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న 176 మద్యం దుకాణాలకు ఇప్పటికే పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతిలిచ్చామని దీని ప్రకారం నీరు, ఫుడ్‌ప్యాకెట్లు అమ్మకాలు, మద్యం తాగేందుకు వీలుంటుందన్నారు. సమావేశంలో డీసీతో పాటు జిల్లా ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, సీఐ గోపాలకృష్ణ, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.