
‘ఉద్యోగినులపై దురుసు ప్రవర్తన సరికాదు’
నరసన్నపేట: గౌరవ ప్రదమైన ఎమ్మెల్యే హోదాలో ఉన్న వారు మహిళల పట్ల, మహిళా ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, స్థాయి మరిచి దుర్భాషలాడటం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తాము మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని, తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న కూటమిలో ఉన్న ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్‌తో ఫోనులో అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదన్నారు. ఈ విషయంపై భేషరతుగా ఆయన ఉద్యోగినికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు మహిళా ఉద్యోగులకు తగిన గౌరవం ఇవ్వాలని హితవు పలికారు. ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా ఉండాలే తప్ప ఇలా చేయకూడదని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
టెక్కలి:
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బాధితురాలు పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యకు న్యాయం చేయాలని దళిత జనోద్ధరణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేవీ రమణ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. దళితులు, దళిత మహిళా ఉద్యోగులపై వేధింపులు పెచ్చుమీరిపోతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రవికుమార్ పూర్తిగా దిగజారిపోయి దళిత మహిళా ఉద్యోగినిపై నోటికి ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడడం రా జ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇలా వ్యవహరించడం ప్రజా ప్రతినిధులకు తగదని పేర్కొన్నారు. బాధితురాలు సౌమ్యకు మద్దతుగా ఈ నెల 20న అంబేడ్కర్ విజ్ఞాన భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి దళిత నాయకులంతా హాజరు కావాలని కేవీ రమణ కోరారు.