
నరకప్రాయంగా.. నగర ట్రాఫిక్
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ముఖ్య పనుల నిమిత్తం వచ్చే ప్రజలు శ్రీకాకుళం నగరంలో తిరగలాంటే తీవ్రంగా చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక పర్వదినాలు వస్తే వాహనాల పరిస్థితి దేవుడెరుగు.. పాదచారులు కూడా నడవలేని దుస్థితి ఏర్పడుతోంది. ఇక ఉదయం స్కూళ్లు, కాలేజీలు తెరిచే సమయం, సాయంత్రం విడిచిపెట్టే వేళల్లో ట్రాఫిక్‌తో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఇతరత్రా పార్కింగ్ చేయాలంటే సరైన చోటు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎక్కడికక్కడే నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేయడమే కాక ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానా చలానాలు కట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
తోపుడు బళ్లు వర్తకం చేసేవారికి మున్సిపాలిటీ అధికారులతో కలసి నోటీసులిచ్చి నియంత్రిస్తున్నాం. అటువంటి చోట్ల (నోపార్కింగ్) బళ్లు పెడితే రూ.వెయ్యి చొప్పున జరిమానా వేస్తున్నాం. కళింగ రోడ్డులో అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్న వాహనాలను టోయింగ్ వెహికల్‌పై స్టేషన్‌కు తీసుకెళ్లి జరిమానా విధిస్తున్నాం. వాహనదారులు పార్కింగ్ పెట్టుకునేందుకు ఎప్పటినుంచి స్థలాభావం ఉంది. ఆటోలు అడ్డదిడ్డంగా తిప్పేవారిపై సీసీ ఫుటేజీలో చూసి స్టేషన్‌కు పిలిపిస్తున్నాం.
– నాగరాజు, సీఐ, శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్
బాటిల్ నెక్ ప్రాంతాల్లో..
నగరంలో రోడ్డు విస్తరణకు నోచుకోని బాటిల్ నెక్‌ప్రాంతాలైన చినబరాటం వీధి ఇరుకుగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రైతుబజారు రోడ్డు, డేఅండ్‌నైట్ సమీప సెయింట్‌జోసెఫ్ స్కూల్, సింధూర ఆసుపత్రి రోడ్లు వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతుంటాయి. ఆటోవాలాలు సైతం అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడం, అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేయడంతో తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
చిన్నబరాటం వీధి: పాతబస్టాండు–జీటీరోడ్డుకు లింక్‌గా ఉండటం.. పాతబస్టాండ్ వెళ్లేందుకు దగ్గరకావడంతో అధికంగా వాహనదారులు ఇటుగా వెళ్లేందుకు మొగ్గుచూపుతారు. సాయంత్రం 6 గంటలనుంచి విపరీతంగా ట్రాఫిక్ ఉంటోంది.
రైతుబజారు రోడ్డు: జీటీరోడ్డు స్టేట్‌బ్యాంకు మెయిన్ బ్రాంచి నుంచి ప్రకాష్‌బాబు ఓల్డ్ బుక్‌స్టాల్ మీదుగా రైతుబజారుకు వెళ్లే మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. రోడ్డు మీదే ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసేయడం, అదే దారిలో మూడు సిమెంట్‌గొడౌన్లు ఉండటంతో లోడ్లు దింపి, ఎక్కించే లారీలు రోడ్డుమీదే ఆపేస్తుండటం, తోపుడు బళ్లపై టిఫిన్లు, స్నాక్స్, ఫాస్ట్‌ఫుడ్ లాంటివి అధికంగా ఉండటంతో వాటి ఎదురుగానే వచ్చేపోయేవారు వాహనాలు నిలుపుతున్నారు. ఉదయం 11 నుంచి ఈ ట్రాఫిక్ తాకిడి ముద్దాడ చిన్నబాబు ఆసుపత్రి వరకు వుంటుంది. రాత్రి 9 గంటల వరకు ఇదే పరిస్థితి.
కళింగరోడ్డు: పాతబస్టాండ్, ఏడురోడ్ల కూడలి, కళింగరోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో స్టీల్‌సామాన్లు, నిత్యావసర సరుకుల దుకాణాలు, పండ్లు, పూల దుకాణాలు ఎక్కువగా ఉండటంతో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపేస్తూ ఉంటారు. పొట్టిశ్రీరాములు పెద్ద మార్కెట్టు ఆనుకొని ఉండటం, సమీపంలోనే ఫైర్, ఒకటో పట్టణస్టేషన్, సబ్‌డివిజనల్ కార్యాలయాలు ఉండటంతో నిత్యం రద్దీయే.
స్కూల్‌జోన్: రామలక్ష్మణ కూడలి సమీపంలో కార్పొరేట్ కళాశాల, డేఅండ్‌నైట్ సమీపంలో మిషనరీస్ స్కూల్ దారిలో విపరీతంగా రద్దీ ఉంటుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం నరకమే. బలగరోడ్డులో సైతం సాయంత్రం 5 గంటల నుంచి ట్రాఫిక్ మొదలవుతుంది.
జిల్లా కేంద్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు
ప్రత్యేక పర్వదినాలు, సాయంత్రాల్లో నడవలేని పరిస్థితి
ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్..
స్కూల్ జోన్లలో పరిస్థితి మరింత దారుణం

నరకప్రాయంగా.. నగర ట్రాఫిక్

నరకప్రాయంగా.. నగర ట్రాఫిక్

నరకప్రాయంగా.. నగర ట్రాఫిక్