
విద్యుత్ లోడ్.. క్రమబద్ధీకరణకు చాన్స్
సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.200
● కిలోవాట్‌పై 50 శాతం రాయితీ
● డిసెంబర్ 31 వరకు గడువు పెంపు
● సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు
హిరమండలం: గృహవిద్యుత్ వినియోగదారులు అదనపు విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరణకు విద్యుత్ శాఖ మరో అవకాశం కల్పించింది. కిలో వాట్ విద్యుత్‌కు 50 శాతం రాయితీతో తగ్గించుకునేందుకు తొలుత మార్చి 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది. అయినా వినియోగదారుల నుంచి అంతంత మాత్రమే స్పందన వచ్చింది. దీంతో డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అఽధికారులు కోరుతున్నారు. వాస్తవానికి గృహ వినియోగదారుల్లో చాలామంది సర్వీస్ పొందే సమయంలో తక్కువ లోడు సామర్థ్యంతో కనెక్షన్ పొందుతారు. తర్వాత ఇంట్లో గృహోపకరణాలు పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం, లోడ్ రెండూ పెరుగుతాయి. ఆ మేరకు విద్యుత్ లోడ్ పెంచుకోకుంటే ఆ ప్రాంతంలో లోవోల్టేజీ సమస్య తలెత్తతుంది. క్షేత్రస్థాయిలో సర్వీసులు, లోడ్ ఆధారంగానే ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తుంటారు. లో ఓల్టేజీ సమస్య తలెత్తినా అక్కడ లోడ్ ఎంత ఉందనే అధికారిక లెక్కల ప్రకారం కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో వినియోగదారులంతా తప్పనిసరిగా గృహోపకరణాల మేరకు లోడ్ పెంచుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు
పెరుగుతున్న వినియోగం..
సాధారణంగా కనెక్షన్ ఇచ్చే సందర్భంలో కిలో వాట్ విద్యుత్ వినియోగానికి గృహాలకు రూ.2 వేలు, దుకాణాలకు రూ.2500 చొప్పున వసూలు చేస్తారు. చాలామంది గృహ వినియోగదారులు ఈ మొత్తానికి సంబంధించి తమ వినియోగం 1 నుంచి 2 కిలోవాట్ లోపలే చూపిస్తున్నారు. వినియోగంలో అంతకు రెట్టింపు కేటగిరీలో చేరిపోతున్నారు. వాణిజ్య కనెక్షన్లకు సంబంధించిన వినియోగమైతే చూపించిన దానికంటే ఏకంగా నాలుగింతలు ఉంటోంది. ఇటువంటి వారంతా అదనపు లోడు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు.
జరిమాన పడకుండా..
● ఇప్పటివరకు అధిక లోడ్ నియంత్రణలో భాగంగా విద్యుత్ అధికారులు, సిబ్బంది తరుచూ ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేసేవారు. అధిక లోడ్ వినియోగిస్తున్న వారిని గుర్తించి రుసుంతో పాటు జరిమానా వసూలు చేసేవారు.
● జిల్లాలో సుమారు 6.71 లక్షలకు పైగా కనెక్షన్‌లు ఉన్నాయి. వీటి పరిధిలోని వినియోగదారుల్లో 50 శాతానికి మంచి కనెక్షన్ తీసుకున్న సమయంలో చూపించిన వినియోగం కంటే అధికంగానే విద్యుత్ వాడుతున్నారు.
● గత ఐదేళ్లుగా ప్రతి నెలా తమకు కేటాయించిన లక్ష్యాల మేరకు రీడింగులు తనిఖీ చేసి అధిక లోడ్ వినియోగిస్తున్న వారికి అపరాధ రుసుం విధిస్తున్నారు.
తీరనున్న లోఓల్టేజ్ సమస్య
గృహాలు, దుకాణాలకు విద్యుత్ కనెక్షన్లు తీసుకునే సమయంలో లైట్లు, ఇతర గృహోపకరణాల వినియోగాన్ని సగటున అంచనా వేసి లోడ్‌ను కిలోవాట్‌లలో లెక్కించి సెక్యూరిటీ డిపాజిట్ డెవలప్‌మెంట్ చార్జీలు వేస్తారు. అధిక శాతం గృహాలకై తే 1 నుంచి 2 కిలోవాట్‌లు, దుకాణాలకు 2 నుంచి 3 కిలోవాట్‌లకు మాత్రమే అనుమతి తీసుకుంటారు. ఈ లెక్క ప్రకారమే ఆయా ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు.
● ఇంటిలో అవసరాలు పెరగడం, దుకాణాలకు సంబంధించి వ్యాపార లావాదేవీలు పెరగడం, వాతావరణ పరిస్థితుల వల్ల అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా విద్యుత్ వినియోగం ఉంటుంది.
● వినియోగం అంచనాకు మించడంతో ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్ ఎక్కువై తరచూ ట్రిప్ కావడంతో లోఓల్టేజ్ సమస్యలు పెరిగిపోతున్నాయి.
విద్యుత్ వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదనంగా వినియోగిస్తున్న లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలి. వినియోగదారులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలి. ఇలా చేసుకుంటే అదనపు రుసుములు , జరిమానా బెడద ఉండదు. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవు.
– జి.వి.ఎస్.ప్రసాదరావు,
ఏడీ, విద్యుత్ శాఖ
ప్రతి అదనపు కిలోవాట్‌కి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.200 నిర్ణయించారు. ఇదే సమయంలో డెవలప్‌మెంట్ చార్జీ రూ.1500 ఉంటుంది. కిలోవాట్‌లు పెరిగే కొద్దీ ఈ రుసుం మారుతుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్ వరకు పొడిగించారు. కిలోవాట్ చొప్పున డెవలప్‌మెంట్ చార్జీలలో 50 శాతం రాయితీ లబిస్తుంది.

విద్యుత్ లోడ్.. క్రమబద్ధీకరణకు చాన్స్