
25న డీఎస్సీ–2003 టీచర్ల మహాధర్నా
శ్రీకాకుళం అర్బన్: కేంద్ర ప్రభుత్వ మెమో 57ను రాష్ట్రంలోనూ వర్తింపజేసి డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ మంజూరు చేయాలని 2003 డీఎస్సీ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎన్జీవో హోంలో శనివారం ఫోరం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి అధ్యక్షతన మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ పాత పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 25న విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించనున్న మహాధర్నాకు డీఎస్సీ–2003 ఉపాధ్యాయులు, బాధిత ఉద్యోగులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు 2004 సెప్టెంబర్ ఒకటికి ముందే నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ.. పోస్టింగులు మాత్రం ప్రభుత్వ విధానాల వల్ల జాప్యం జరిగిందన్న విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోవద్దని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడి ధోరణి ప్రదర్శిస్తు జాప్యం చేస్తుండటంతో గత్యంతరం లేని పరిస్థితులలో ధర్నా చేపట్టాల్సి వస్తోందన్నారు.రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దాదాపు 16 రాష్ట్రాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మెమోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు దుప్పల శివరాం ప్రసాద్ (ఆపస్), ఎస్వీ రమణమూర్తి(ఎస్టీయూ), దానేటి కేశవరావు (పీఆర్‌టీయూ), కూన రంగనాయకులు (ఎస్‌ఎల్‌టీఏ), పూజారి హరిప్రసన్న(డీటీఎఫ్), సూర పాపారావు (ఎన్‌టీఏ), కరిమి రాజేశ్వరరావు (ఏపీ సీపీఎస్‌ఈఏ), గురుగుబెల్లి భాస్కరరావు (ఏపీ సీపీఎస్‌యూఏ), ఫోరం జిల్లా కో కన్వీనర్లు ఏ.తిరుమలేశ్వరరావు, ఏ.లక్ష్మణ్, జి.గోవిందరావు, నారాయణరావు, ఫల్గుణరావు, తదితరులు పాల్గొన్నారు.